- గైడ్‌లైన్స్ విడుదల చేసిన వ్యవసాయ శాఖరాష్ట్రస్థాయిలో అమలు బాధ్యత అగ్రికల్చర్ డైరెక్టర్‌కు
- ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగింత
- సాగు యోగ్యంకాని భూములను గుర్తించేందుకు రంగంలోకి ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్
హైదరాబాద్, వెలుగు: పోడు భూములకూ (ఆర్ వోఎఫ్ఆర్ పట్టాలు) రైతు భరోసా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. పంట వేసినా.. వేయకున్నా.. సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా పేరుతో రైతాంగానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ పథకం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులు (తెలుగులోనూ) జారీ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆహార భద్రత కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జనవరి 26 నుంచి సర్కారు అమలు చేయనున్నది. భూ భారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించనున్నారు. అయితే, రాళ్లు, రప్పలు, బోర్లు, గుట్టలు వంటి వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని సర్కారు నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ ఫర్(డీబీటీ) ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఐటీ భాగస్వామిగా ఉంటూ ఈ పథకం నిధుల ప్రక్రియ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆయా జిల్లాలకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలు కలెక్టర్లు నిర్వహిస్తారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వీరే పరిష్కరించనున్నారు. రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించి బాధ్యతలను అగ్రికల్చర్ డైరెక్టర్నిర్వర్తించనున్నారు.
సాగు యోగ్యత లేని భూముల గుర్తింపునకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్
సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్‌లను రంగంలోకి దించుతున్నారు. పంచాయతీరాజ్, మండల రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారుల సారథ్యంలో సాగు యోగ్యంలో లేని భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టనున్నారు. పంచాయతీ సెక్రటరీ, ఏవోలు, ఆర్ఐ లు ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ లీడర్స్‌గా ఉంటారు. ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్‌లో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్ఏ, ఏఈవోలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డీఏవోలు, ఎంపీడీవోలు తదితర ఉన్నతాధికారులు ఈ టీమ్‌లను పర్యవేక్షిస్తారు.
ఇలా గుర్తిస్తారు..
ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్‌లు విలేజ్‌లో ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయో గుర్తిస్తాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బృందంగా సర్వే చేస్తారు. ఆయా గ్రామాల్లోని ఆర్వోఆర్, పట్టాదారు పాస్‌పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూ భారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా పర్యవేక్షించి, వ్యవసాయ యోగ్యంకాని భూముల జాబితాను రూపొందిస్తారు. దాని ఆధారంగా తహసీల్దారు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నంబర్లలో ఉన్న భూములను పరిశీలించి, వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు. ఆ భూముల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు. అనంతరం గ్రామాలవారీగా వ్యవసాయ యోగ్యంకాని భూముల పట్టికను పోర్టల్‌లో సంబంధిత అధికారి నమోదు చేసి, డిజిటల్ సంతకం చేస్తారు. ఈ నెల 16 నుంచి 19 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 25న ఈ జాబితాలను జిల్లాలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి.. మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జనవరి 26న విడుదల చేస్తుంది.