
జనగామ, వెలుగు : పట్టాదారు పాసు బుక్కు లేకుండా తమ భూమిని ఒక్కరి పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ ఆగ్రహించిన బాధితులు జనగామ డిప్యూటీ తహసీల్దార్ జగన్ పై శుక్రవారం దాడి చేశారు. ఒక్కసారిగా ఆఫీస్ లోకి దూసుకొచ్చి డీటీతో వాగ్వాదానికి దిగారు. కాలర్ పట్టి లాగడంతో షర్ట్ చినిగిపోయింది. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. జనగామ మండలం వడ్లకొండకు చెందిన ముల్కల పోశమ్మ, వెంకటయ్యలకు ఏడుగురు కుమారులు, ఒక కూతురు. పోశమ్మ గత జనవరి 27న వడ్లకొండ రెవెన్యూ పరిధిలోని 645/2 సర్వే నంబర్ లో తనకున్న 20 గుంటల భూమిని కూతురు గాజ సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. ఆ టైంలో పట్టాదారు పాసు బుక్ లేక పోవడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాసుబుక్ కనిపించడంలేదని పోశమ్మ ఫిర్యాదు చేసింది.
వృద్దురాలినైన తన ఆలనా పాలనా కూతురే చూసుకుంటుందని.. ఎలాగైనా రిజిస్ట్రేషన్ చేయాలని వారిని కోరింది. దీంతో వన్ బీ ఆధారంగా డీటీ జగన్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం తెలిసి ఆ భూమిపై తమ ఏడుగురికి హక్కుఉందని, పాసుబుక్ లేకుండా ఒక్కరి పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని పోశమ్మ కొడుకులు, వారి కుటుంబసభ్యులు ఆఫీస్ కు వచ్చి డీటీని నిలదీశారు. లంచం తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరగగా బాధితులు డీటీ టేబుల్ పై ఉన్న దరఖాస్తులను చిందర వందర చేశారు. అతని కాలర్ పట్టి గుంజారు. బాధితులు తహసీల్దార్ వెంకన్నను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తానని తహసీల్దార్హామీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పాసుబుక్ పోయిందని ఫిర్యాదు చేస్తే రూల్స్ మేరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశానని డీటీ జగన్ అన్నారు. అకారణంగా తన పై దాడి చేసి గాయపరిచారని వాపోయారు.
దాడి చేసిన వారిపై కేసు నమోదు
డీటి జగన్పై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్లకొండ కు చెందిన ముల్కల శ్రీను, రాజు, మల్లేశ్, ఉప్పలయ్య, వెంకటయ్య, నాగరాజు, తరుణ్ , కరుణాకర్, అంజమ్మ, అనసూయ, పద్మ, శారద, సుజాత తదితరులు తహసీల్దార్ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ జగన్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని తహసీల్దార్ వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ పై దాడిని టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సంఘం లీడర్లు రాజనర్సయ్య, రాంనర్సయ్య. మధు, ప్రభాకర్ తదితరులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు.