- మునగ సాగు, తేనెటీగలు, కొర్రమీను చేపల పెంపకంపై దృష్టి సారించాలి
- భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్త తరహాలో వ్యవసాయంతో రైతులకు లాభాలు వచ్చేలా అగ్రికల్చర్ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని వ్యవసాయశాఖాధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా సన్నకారు రైతులకు లాభం కలిగేలా వ్యవసాయం పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు.
ఎకరం పొలంలో వరి సాగు చేసే కన్నా మునగ సాగు చేయడంతో అధిక లాభాలు వస్తాయని రుజువైందని చెప్పారు. ప్రతి అధికారి ఒక రైతును ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. మునగ సాగు చేసే వారికి నీటి కుంటల ఏర్పాటు, మొక్కలు నాటేందుకు గుంతల తవ్వడానికి ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు. నీటి కుంటల్లో అజొల్ల నాచు పెంపకం ద్వారా ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.
అదే నీటి కుంటలో కొర్రమీను చేపల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఆయిల్పామ్సాగులో అంతర పంటగా అరటి సాగు చేసుకోవచ్చన్నారు. తేనెటీగల పెంపకం ద్వారా రైతులకు మరింతగా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్బాబూరావు, హార్టికల్చర్ఆఫీసర్ సూర్యనారాయణ, జిల్లా మార్క్ఫెడ్ అధికారి సునీత, జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ అధికారి బిక్షం, ఏడీఏ రవి కుమార్ పాల్గొన్నారు.
చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి: అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపికైన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రాల్లోని జడ్పీ హైస్కూళ్లలో పనులను గురువారం ఆయన పరిశీలించారు.అధికారులకు పలు సూచనలు చేశారు. స్కూళ్లలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి స్టూడెంట్లకు తాగు నీరు సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.