ట్రిపుల్‌‌ ఆర్‌‌ ‘అవార్డ్‌‌’ మీటింగ్‌‌ బహిష్కరణ

ట్రిపుల్‌‌ ఆర్‌‌ ‘అవార్డ్‌‌’ మీటింగ్‌‌ బహిష్కరణ
  • చౌటుప్పల్‌‌ తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌ ఎదుట రైతుల ధర్నా
  • బహిరంగ మార్కెట్‌‌ ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌‌

చౌటుప్పల్‌‌, వెలుగు : రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్‌‌ భూ సేకరణలో భాగంగా గురువారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌లో ఏర్పాటు చేసిన ‘అవార్డ్‌‌’ మీటింగ్‌‌ను రైతులు బహిష్కరించారు. భూములు కోల్పోతున్న నేలపట్ల, తంగడపల్లి రైతులతో చౌటుప్పల్‌‌ తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లో మీటింగ్‌‌ ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆర్డీవో శేఖర్‌‌రెడ్డి హాజరై సుమారు గంట పాటు వెయిట్‌‌ చేసినా రైతులెవరూ రాలేదు. అయితే తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌ వద్దకు వచ్చిన రైతులు లోపలికి రాకుండా బయటే ధర్నాకు దిగారు. 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్‌‌ ఆర్‌‌ నిర్మించాల్సి ఉండగా చౌటుప్పల్‌‌లో 28 కిలోమీటర్ల దూరంలోనే నిర్మిస్తున్నారన్నారు. దివీస్‌‌ కంపెనీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఇక్కడ  దూరం తగ్గించారని ఆరోపించారు. రూల్స్‌‌ ప్రకారం 40 కిలోమీటర్ల తర్వాతే రోడ్డు వేయాలని, అలాగే బహిరంగ మార్కెట్‌‌ రేటు ప్రకారం భూముల ధరలు పెంచి అవార్డు ప్రకటించాలని డిమాండ్‌‌ చేశారు. 

మీటింగ్‌‌కు హాజరుకావాలని ఆర్డీవో శేఖర్‌‌రెడ్డి కోరినా రైతులు ఒప్పుకోలేదు. ఆందోళనలో దబ్బటి రాములుగౌడ్, చింతల దామోదర్‌‌రెడ్డి, బోరం ప్రకాశ్‌‌రెడ్డి, సందగల్ల మల్లేశం, గుజ్జుల సురేందర్‌‌రెడ్డి, చింతల సుధాకర్‌‌రెడ్డి, చింతల ప్రభాకర్‌‌రెడ్డి, జాల శ్రీశైలం, పబ్బు శివగౌడ్ పాల్గొన్నారు.