పంట రుణమాఫీ..  ఖమ్మం రైతులు ఫుల్ ​హ్యాపీ!

పంట రుణమాఫీ..  ఖమ్మం రైతులు ఫుల్ ​హ్యాపీ!
  • రైతు వేదికల్లో సంబురాల్లో పాల్గొన్న అన్నదాతలు
  • ఖమ్మం జిల్లాలో 57,857 మందికి రూ. 264.23 కోట్లు జమ
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 28,018 మంది ఖాతాల్లో  రూ. 132కోట్లు జమ

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయడంతో రైతులు ఫుల్​ ఖుషీగా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతన్నలు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 57,857 మంది రైతులకు సంబంధించిన అకౌంట్లలో గురువారం ప్రభుత్వం రూ.264.23 కోట్లు జమచేసింది. ఇందులో అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 16,043 మంది రైతులకు లబ్ధి జరిగింది. ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో 15,760 మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొదటి దశలో 28,018 మంది రైతుల ఖాతాల్లో రూ. లక్ష లోపు రుణమాఫీ దాదాపు రూ. 132కోట్లు జమ అయ్యాయి. టేకులపల్లి మండలంలో అత్యధికంగా 2,234 మందికి రుణమాఫీతో లబ్ధి చేకూరింది. 

రైతు వేదికల వద్ద సంబురాలు

రుణమాఫీ సందర్భంగా గురువారం సాయంత్రం రైతువేదికల దగ్గర సంబురాలు నిర్వహించారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడారు. కూసుమంచిలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, కల్లూరు మండలం కొర్లగూడెంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఇల్లెందు మండలంలోని సుదిమళ్లలో ఎమ్మెల్యే కోరం కనకయ్య , కలెక్టర్ జితేష్ వి పాటిల్, రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్, చుంచుపల్లిలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్,  దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో భద్రాచలం ఎమ్మెల్య డాక్టర్​ తెల్లం వెంకట్రావ్​ పాల్గొన్నారు.

గత బీఆర్ఎస్  ప్రభుత్వం రూ. లక్ష లోపు రుణమాఫీని నాలుగు దశల్లో ఐదేండ్లు సాగదీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఒకే దశలో రూ.లక్షలోపు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మెయిన్​ రోడ్లపై పటాకులు కాల్చారు. 

రుణపడి ఉంటాం

మా కుటుంబానికి డీసీసీబీ బ్యాంకులో వడ్డీతో కలిపి రూ.80 వేల అప్పు ఉంది. రూ.20 వేల వరకు వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మొదటి లిస్ట్ లో మాపేరు కూడా ఉంది. సొసైటీ బ్యాంకులో ఉన్న మొత్తం రుణం రూ.80 వేలు ఒకేసారి మాఫీ అయ్యింది. పాన్ షాప్ నడుపుతూ, ఉన్న కొంత పొలాన్ని సాగు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మా రుణం మొత్తం మాఫీ చేసినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం.  

మట్టా రాజేశ్, యువ రైతు, పెనుబల్లి , ఖమ్మం జిల్లా 

మస్తు సంతోషంగా ఉంది.. 

రుణ మాఫీ చేసినందున మస్తు సంతోషంగా ఉంది. రూ. 40వేలు లోన్ మాఫీ అయిందని ఆఫీసర్లు చెప్పిన్రు. తొలుత రుణ మాఫీ చేస్తామంటే కొంత అనుమానంగానే ఉండే. కానీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్​రెడ్డి ఇప్పుడు రుణమాఫీ చేసిన్రు.. మంచిగ అనిపిస్తోంది. 

గుర్రం లక్ష్మి, పెనుబల్లి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా 

రైతుల సంక్షేమమే  కాంగ్రెస్​ధ్యేయం : ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

కూసుమంచి,వెలుగు : రైతుల సంక్షేమమే కాంగ్రెస్​ప్రభుత్వ ధ్యేయం అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. రైతులకు దేశంలో ఏప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు ఒక్క కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. 

సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్​

భద్రాచలం,వెలుగు : రుణమాఫీ వల్ల రైతుల ఆనందానికి అవధుల్లేవని భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్​ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రతీసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డికి భద్రాచలం నియోజకవర్గం తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. 
ఇక రైతు ఇంట పండుగే..

ఎమ్మెల్యే కోరం కనకయ్య 

ఇల్లెందు, వెలుగు :  రాష్ట్రంలో  రైతు రుణమాఫీతో  రైతుల ఇంట పండుగ వాతవరణం కనిపిస్తోందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. వరంగల్ డిక్లరేషన్​లో  భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. 

రైతులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే రాగమయి 

తల్లాడ/సత్తుపల్లి/కల్లూరు, వెలుగు: రైతన్నలకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మొదటగా లక్ష లోపు రుణమాఫీకి నిధులు రైతులు ఖాతాలో జమ చేసినందుకు సీఎం రేవంత్​రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

రుణమాఫీ రైతులకు వరం

పాల్వంచ రూరల్​, వెలుగు : రుణమాఫీ పథకం రైతులకు వరం అని డీసీఎంఎస్​ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల వాగ్ధానాలలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించి, ఆచరణలో పెడుతున్న రూ.2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం ప్రజల పక్షాన నిలబడి పరిపాలన సాగిస్తోందని తెలిపారు.