ఆదిలాబాద్ జిల్లాలో పండుగలా రుణమాఫీ  

నెట్​వర్క్, ఆదిలాబాద్: కాంగ్రెస్​ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో రైతులు సంబురాల్లో మునిగి తేలారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ ​రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి అన్ని మండలాల్లో ర్యాలీలు తీశారు. రైతు వేదికల వద్ద మొదట సీఎం ప్రసంగం విన్నారు. ఆ తర్వాత స్వీట్లు పంచుతూ, పటాకులు కాల్చుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు.

రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలో రైతు రుణమాఫీ సంబురాల్లో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్నికల సభలో వరంగల్ రైతు డిక్లరేషన్​లో భాగంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని, ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీని చేస్తామన్నారు. కుంటాలలో నిర్వహించిన వేడుకల్లో ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్ పాల్గొన్నారు. రుణమాఫీ దేశానికే ఆదర్శమన్నారు. 

రైతు నేస్తం కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నేస్తంగా చెరగని ముద్ర వేసుకుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కన్నాల గ్రామపంచాయతీలోని రైతు వేదికలో రుణమాఫీపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

రుణమాఫీ చేస్తామని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్సెట్టిపేట, దండేపల్లిలోని రైతు వేదికల్లో జరిగిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. రైతాంగం శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, వారి అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. 

రైతు సంక్షేమం కోసమే రుణమాఫీ

రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తోందని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో వ్యవసాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులతో కలిసి రైతు రుణమాఫీ పథకాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ ఫస్ట్ లిస్ట్​లో పేరు లేని రైతులు ఆందోళన చెందవద్దని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. దండేపల్లి మండలం ద్వారక రైతు వేదికలో నిర్వహించిన  సంబురాల్లో రైతులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు.