- మొదటి విడతలో గురువారం లక్ష లోపు రుణమాఫీ
- రైతు వేదికల వద్ద పటాకులు కాల్చిన అన్నదాతలు
- ఉమ్మడి జిల్లా రైతులకు లబ్ధి, కాంగ్రెస్ నాయకుల సంబరాలు
బోధన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష లోపు రుణాలను గురువారం మాఫీ చేయడంతో అన్నదాతలు సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో రైతు వేదిక నుంచి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మాశరత్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సంకేత్ ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో మొత్తం రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేయనున్నామని చెప్పారు.
మొదటి విడతగా భాగంగా గురువారం లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తున్నామని వివరించారు. గురువారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6098 కోట్ల నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో రూ. 226 కోట్లు రుణమాఫీ కింద రైతుల అకౌంట్లలో పడ్డాయని సీఎం తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ సంకల్పం అని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు రైతు వేదిక ల వద్ద పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాకు మొదటి విడతగా రూ.225.62 కోట్లు రిలీజ్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత రుణమాఫీ ద్వారా ప్రభుత్వం 44,469 బ్యాంకు ఖాతాల్లో రూ. 225. 62 కోట్లు జమ చేసింది. గ్రామ పంచాయతీ ఆఫీస్‌లలో లబ్ధి పొందిన రైతుల లిస్టును అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటించారు. దీంతో రైతు వేదికల వద్ద కేక్ కట్ చేసి పటాకులు కాల్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. గవర్నమెంట్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో రుణ మాఫీ వివరాలు
సెగ్మెంట్ బ్యాంకు ఖాతాల రుణమాఫీ
ఆర్మూర్ 5,736 రూ.30.27 కోట్లు
బాల్కొండ 7,120 రూ.40.62కోట్లు
బోధన్ 12,026 రూ.55.18''
బాన్సువాడ 7,609 రూ.36.40''
(జిల్లాలోని మండలాలు )
రూరల్ 11,866 రూ. 62.73 ''
అర్బన్ 112 రూ. 0.42 మొత్తం 44,469 రూ.225.62