యాదాద్రి జిల్లాలో రుణమాఫీ వేడుకలు

  • ర్యాలీలు, క్షీరాభిషేకాలు, పాల్గొన్న రైతులు, కాంగ్రెస్ శ్రేణులు

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడంతో యాదాద్రి జిల్లాలో సంబురాలు మిన్నంటాయి. చేసిన అప్పు తీరిపోయిందని సంబురపడ్డారు. రైతులు కాంగ్రెస్​ శ్రేణులు ఎక్కడికక్కడ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు  భట్టివిక్రమార్క ప్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. 2018 నుంచి 2023 వరకూ యాదాద్రి జిల్లాలోని పలు బ్యాంకుల్లో రైతులు పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలను మాఫీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్​ సర్కారు ఐదేండ్లు గడిచినా మాఫీ చేయలేదు.

2023 ఎన్నికల ముందు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్​ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే తన మాట నిలబెట్టుకున్నారు. రుణమాఫీ మొదటి విడతలో రూ.లక్షలోపు తీసుకున్న యాదాద్రి జిల్లాలోని 17 మండలాల రైతులు 36,483 మంది రుణాలకు సంబంధించిన రూ.199,87,58,873  గురువారం మాఫీ చేశారు. జిల్లాలోని 17 రైతుల వేదికలతోపాటు పలుచోట్ల నిర్వహించిన రుణమాఫీ సంబురాల్లో రైతులు, కాంగ్రెస్​ శ్రేణులు వేలాది మంది పాలు పంచుకున్నారు. సీఎం రేవంత్​రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​ను ఆసక్తిగా తిలకించారు.  

సంబురాల్లో భాగంగా వలిగొండలో ఎడ్లబండిపై వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. తుర్కపల్లిలో నిర్వహించిన ర్యాలీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. జిల్లా బొమ్మల రామారం మండలం మర్యాలలో రైతులను ఎమ్మెల్సీ తీర్మార్​ మల్లన్న కలిసి మాట్లాడారు. వారితో కలిసి పొలంలో దిగి నాట్లు వేశారు. అనంతరం సీఎం రేవంత్​రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​ను రైతులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. వివిధ మండలాల్లో సీఎం ఫ్లెక్సీతోపాటు ఎమ్మెల్యేల ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. 

సూర్యాపేట జిల్లాలో.. 

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో మొత్తం 56, 274 మంది రైతులకు రూ.లక్షలోపు రుణ మాఫీ చేయగా, ఇందుకు రూ.282.98 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 17,357 మంది రైతులకు రూ.97.50 కోట్లు మాఫీ చేసింది. హుజుర్ నగర్ నియోజకవర్గంలో 16, 522 మంది రైతులకు రూ.80.05 కోట్లు, కోదాడ 16,868 మంది రైతులకు రూ.76.99 కోట్లు, సూర్యాపేట నియోజకవర్గంలో 11,637 మంది రైతులకు రూ.62.41 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం 

ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలోని 11,325 మంది రైతుల రుణాలు రూ. 63.45 కోట్లు మాఫీ చేశాం. బీఆర్ఎస్​ పదేండ్లు పవర్​లో ఉన్నా రైతుల రుణాలను మాఫీ చేయలేదు. గృహజ్యోతి హామీ ప్రకారం జీరో కరెంట్​ బిల్లులు, గ్యాస్​ సబ్సిడీ చెల్లిస్తున్నాం. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షల పెంచాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. 

 బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే 

ప్రజాపాలన చేస్తున్నం 

మా ప్రభుత్వం ప్రజాపాలన చేస్తోంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నం. రుణమాఫీ చేసినం. భువనగిరి నియోజవర్గంలో 9729 మంది రైతులకు చెందిన రూ.51.18 కోట్లు మాఫీ చేసినం. జీరో కరెంట్​ బిల్లు అమలు చేస్తున్నం. సబ్సిడీపై గ్యాస్​ అందిస్తున్నం. 

కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి 

రాష్టంలో రైతు రాజ్యం..

తెలంగాణ రాష్ర్టంలో రైతు రాజ్యం వచ్చింది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే  రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినం. ఈరోజు అమలు చేస్తున్నాం. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి నకిరేకల్ నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు.

ఎమ్మెల్యే వేముల వీరేశం