- ఊరూరా రైతుల సంబురాలు
- ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,30,725 లోన్ అకౌంట్లలో రూ.688.42 కోట్లు జమ
- 1,24,167 కుటుంబాలకు లబ్ధి
కరీంనగర్, వెలుగు: పల్లెల్లో రుణమాఫీ పండుగ షురువైంది. మొదటి విడతలో ఒకేసారి రూ.లక్ష రుణాలు మాఫీ కావడంతో రైతు కుటుంబాల్లో పట్టరాని సంతోషం వ్యక్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు ఊరూరా క్షీరాభిషేకాలుచేస్తూ, బాణసంచా పేల్చుతూ, స్వీట్లు పంచుతూ రైతులు సంబురాలు చేసుకున్నారు. కొందరు రైతు వేదికలు, పంచాయతీ ఆఫీసుల వద్దకు చేరుకుని సంతోషం పంచుకోగా.. వరినాట్లు, ఇతర పనుల్లో ఉన్న మరికొందరు రైతులు తమ పొలాల వద్దే సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం తమ అభిమానం చాటుకున్నారు.
రుణమాఫీతో తమ కష్టాలు తీరాయని, బీఆర్ఎస్ నాయకులు కాదన్న హామీని చేసి చూపించారని కొనియాడారు. కాంగ్రెస్ సర్కార్ పది కాలాలపాటు సల్లగుండాలని దీవించారు. ఉమ్మడి జిల్లాలో రైతులకు చెందిన 1,30,725 క్రాప్ లోన్ అకౌంట్లలో రూ.688.42 కోట్లు జమ అయ్యాయి. దీంతో రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న 1,24,167 కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
పేద రైతుకు పెద్ద సాయం..
సీఎం రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ పేద రైతులకు పెద్ద సాయం. నేను జీపీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నా. నాకున్న ఎకరం పావు భూమిలో పంట సాగు చేసేందుకు గతంలో రు.69 వేలు లోన్ తీసుకున్నా. రైతుల కష్టాలు తెలిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయడం ద్వారా నాకు అసలు, వడ్డీ కలిపి రూ.73 వేల వరకు మాఫీ అయింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
కుమ్మరి లింగయ్య, రుక్మాపూర్, చొప్పదండి మండలం, కరీంనగర్
రేవంత్ రెడ్డి పదికాలాల పాటు సల్లంగ ఉండాలే:
నాకున్న 29 గుంటల భూమిలో సాగుచేసుకొని జీవిస్తున్నాం. రెండేళ్ల కింద రూ.90 వేలు పంట భూమిపై బ్యాంకు లో లోన్ తీసుకున్నా. తీసుకున్న లోన్ తిరిగిచెల్లించేందకు డబ్బులు ఎల్లలేదు. దీంతో రెండేళ్లుగా చెల్లించలేదు. రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్‌రెడ్డి పదికాలాల పాటు సల్లంగ ఉండాలే.
చెన్నూరు నిర్మల, బండలింగపూర్, మెట్ పల్లి
లోన్ మాఫీ చేయడం సంతోషం
పంట పెట్టుబడి కోసం తాను తీసుకున్న క్రాప్ లోన్ ను సర్కార్ మాఫీ చేయడం సంతోషంగా ఉంది. నాకున్న ఎకరం పొలంలో పంట పెట్టుబడి కోసం మెట్ పల్లి సొసైటీలో రూ.20 వేలు తీసుకున్నా. పండిన పంటను అమ్మితే పెట్టుబడులు, ఇంటి ఖర్చులకే సరిపోతలేవు. దీంతో బ్యాంకు అప్పు కట్టడం కష్టంగా మారింది. పొలం చేసుకోవడంతోపాటు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న నాకు బ్యాంకు అప్పు తీర్చడం ఎలా అనే బెంగ ఉండేది.
ఎల్కపెల్లి శంకరయ్య, ధర్మారం, శంకరపట్నం మండలం
అప్పు రంది తీరింది
మాకున్న రెండు ఎకరాల సాగుచేసుకుని బతుకుతున్నం. నాలుగేళ్ల కింద బ్యాంకులో రూ.60 వేల క్రాప్‌లోన్ తెచ్చుకున్నం. సరైన దిగుబడి రాక, వచ్చినా అప్పులు తీరక ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. ఇప్పటి వరకు అప్పు కట్టలేక పోయాం. కాంగ్రెస్ సర్కారు మంజూరు చేసిన రూ.లక్ష లోపు రుణమాఫీ తో అప్పు కట్టే రంది తీరింది
బొమ్మెన లక్ష్మీ- రాజయ్య దంపతులు, చిన్న మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల
జిల్లా అకౌంట్లు కుటుంబాలు మాఫీ(రూ.కోట్లలో)
కరీంనగర్ 37,745 35,686 194.64
పెద్దపల్లి 29,725 28,080 149.43
జగిత్యాల 39,269 37,438 207.99
రాజన్న సిరిసిల్ల 23,986 22,963 136.36