వరంగల్‌లో అన్నదాత ఆనందం  

మాఫీ అయిన పంట రుణాలు .. ఉమ్మడి జిల్లాలో ఊరూరా రైతన్నల సంబురాలు 

వెలుగు, నెట్​వర్క్​ :  కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం రుణమాఫీ చేయడంతో ఉమ్మడి జిల్లా రైతుల ఆనందానికి అవధల్లేవు. డిక్లరేషన్‍ ప్రకటించిన ఓరుగల్లులో రైతులు సంబురాలు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు.

ఊరూరా పటాకులు  కాల్చారు. రైతు వేదికల్లో స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన రైతు వేదికల్లో సీఎం రేవంత్​ వీడియో కాన్ఫరెన్సు చూసేందుకు నాయకులతోపాటు, రైతులు తరలివచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్​కాలం స్వర్ణయుగమని , రైతు రుణమాఫీ చారిత్రాత్మకమని కాంగ్రెస్​ లీడర్లు అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, రైతులకు రుణమాఫీ చేయడం సంతోషమని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 

2022 మే 6న    

‘తెలంగాణ అంటే ఎన్నికలకు ముడిసరుకు కాదు. తెలంగాణ అంటే పేగు బంధం. ఆత్మగౌరవం. రైతుల కోసం కాంగ్రెస్‍ బాధ్యత తీసుకుంటుంది’
వరంగల్​ రైతు సంఘర్షణ సభలో.. రాహుల్‍గాంధీ సమక్షంలో రేవంత్‍రెడ్డి 

2024 జులై 18న  

ఓరుగల్లు కేంద్రంగా ప్రకటించిన రైతు డిక్లరేషన్​లోని రుణమాఫీ హామీ నెరవేరింది. ''కాంగ్రెస్‍ డిక్లరేషన్‍ చేసిందంటే.. గ్యారంటీ” అన్న రాహుల్‍గాంధీ మాట నిజమైంది. కాంగ్రెస్‍ ఇచ్చిన మాట ప్రకారం గురువారం రుణమాఫీ జరిగింది. 

 రూ.85 వేల  రుణమాఫీ అయ్యింది

నెల్లికుదురులోని ఎస్​బీఐలో 2.10 ఎకరాలకు రూ. 85 వేల రుణం తీసుకున్నాను. ఒకేసారి రుణమాఫీ కావడం మరిచిపోలేనిది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. 

గూగులోతు మంగ్య, రైతు, రత్తి రాం తండా గ్రామం, నెల్లికుదురు మండలం

సంతోషంగా ఉంది

నాకు మూడెకరాల భూమి ఉంది. రూ. 90 వేలు లోను తీసుకున్నా. కేసీఆర్​ ఉన్నప్పుడు మా తండాలో కొందరికే మాఫీ అయింది. నేను లోన్​ తీసుకొని రెండు సంవత్సారాలు అవుతుంది. ఊర్లో వడ్డికి తెచ్చి పెట్టు బడులు పెడుతున్నా. ఇప్పుడు మాఫీ కావడం సంతోషంగా ఉంది. 

బానోతు లచ్చు, రైతు. హట్యాతండ. పాలకుర్తి మండలం, జనగామ