మూడు జిల్లాల్లో..99,041 మంది రైతులు 546.85 కోట్లు

మూడు జిల్లాల్లో..99,041 మంది రైతులు 546.85 కోట్లు
  • రైతు రుణమాఫీ అమలుకు అధికారుల చర్యలు 
  • రంగారెడ్డి జిల్లాలో 49,741 మందికి  రూ. 278. 6 కోట్లు 
  • మేడ్చల్ జిల్లాలో 2,667 మందికి  రూ. 12.53 కోట్లు 
  • వికారాబాద్ జిల్లాలో 46,633 మందికి రూ. 256.26  కోట్లు

రంగారెడ్డి, వెలుగు : రైతు రుణమాఫీ సందర్భంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో రైతు వేదికల్లో రైతులు సంబురాలను ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో 49,741 మంది రైతులకు తొలివిడతలో రూ. లక్ష లోపు రూ. 278.06 కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. ఇందుకు గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ, సహకార, బ్యాంకు అధికారులతో కలెక్టర్ శశాంక సమావేశం నిర్వహించి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన  రైతు రుణమాఫీని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు  ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  రైతులకు నేరుగా ఖాతాల్లో సొమ్ము జమవుతుందని తెలిపారు. ప్రతి బ్యాంకుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఏమైనా తలెత్తితే  వ్యవసాయశాఖ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం డీఎల్ఆర్ సీ మీటింగ్ లో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వానాకాలం, యాసంగికి సకాలంలో పంట రుణాలు చెల్లించాలని బ్యాంకర్లను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కుసుమ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లాలో..

మేడ్చల్ కలెక్టరేట్: జిల్లాలోని అర్హులైన రైతులకు రుణ మాఫీ అందేలా బ్యాంకులు, సహకార సొసైటీ బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. వ్యవసాయ, బ్యాంక్, డీసీసీ, పీఏసీఎస్ బ్యాంక్ అధికారులతో  రైతు రుణమాఫీపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో రుణమాఫీ కింద మొదటి విడతలో 2,667 మంది రైతులకు రూ. లక్షలోపు రూ. 12 .53  కోట్లు అందించాలని స్పష్టంచేశారు.

రుణమాఫీపై ఏవైనా సందేహాలు ఉంటే  వ్యవసాయ శాఖ ఆఫీసుల్లో అధికారులు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రైతులకు నివృత్తి చేయాలని, ఇందుకు బ్యాంకులతో కో ఆర్డినేట్‌‌ చేసుకోవాలని సూచించారు. బ్యాంకు నోడల్ అధికారు లు తమ సంబంధిత బ్యాంకు ఇచ్చిన పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి రేఖ మేరీ, ఎల్ డీఎం శ్రీనివాసులు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

వికారాబాద్ జిల్లాలో..

వికారాబాద్ : రుణ మాఫీతో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.  కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో  పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి , అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తో కలిసి పాల్గొని మాట్లాడారు.

జిల్లాలో 46,633 మంది రైతులకు రూ. 256.26  కోట్లను తొలివిడగా అందించనుందని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా నేరుగా వారి ఖాతాల్లోకే వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  జాబితాలో పేర్లు లేని రైతులు  కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ 9989291049, 9000470989 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఎల్డీఎం యాదగిరి, ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ పల్లంరాజు,  బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.