
హైదరాబాద్, వెలుగు: రైతు కమిషన్ పునరావాస కేంద్రంగా మారిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్లపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతు సమన్వయ సమితికి పల్లా చైర్మన్ గా ఉన్నపుడు సొంత పనులకు వాడుకున్నారని, తాము కూడా అలాగే చేస్తామని ఆయన భావిస్తే ఎలా అని కోదండ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
‘‘రైతులు, వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేకపోయినా పల్లాను రైతు సమన్వయ సమితి చైర్మన్గా నాడు బీఆర్ఎస్ నియమించింది. రైతులకు, వ్యవసాయ రంగానికి ఏమీ చేయకుండా కమిషన్ను పునరావాసంగా మార్చుకున్నది పల్లా. కమిషన్ను సొంత పనులకు వాడుకున్నారు. అదే ధ్యాసలో మాపై విమర్శలు చేశారు.
రైతుల గురించి, వ్యవసాయం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆయన రైతు కమిషన్ కార్యాలయానికి వస్తే, కమిషన్ చేపట్టే కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తాం” అని కోదండ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కమిషన్ ఏర్పాటయ్యాక కమిషన్ బృందం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటించి, వ్యవసాయ క్షేత్రాలను, మార్కెట్ యార్డులను సందర్శించిందని, కమిషన్ ఆఫీసులో అనేక సమావేశాలు నిర్వహించిందని తెలిపారు.