- మార్కెట్ధర ఎకరాకు రూ.30లక్షల పైనే
- అధికారులు ఇస్తాం అంటున్నది ఎకరాకు రూ.11.50లక్షలే
- పరిహరం పెంపు కోసం రైతులు ఆందోళనలు
మహబూబాబాద్, వెలుగు: నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు వేస్తున్న నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే 163రోడ్డు పరిహారంలో అధికారుల తీరుపై జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు మార్కెట్ రేట్ కంటే సగం కన్నా తక్కువ ధర చెల్లిస్తామనడంతో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో హైవే ఏర్పాటుకు అడ్డంకులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం మండలంలోని కోరు కొండపల్లి, మహమూద్ పట్నం, ఇనుగుర్తి మండలం కోమటిపల్లి, చిన్నముప్పారం, నెల్లికుదురు మండలం ఆలేరు,నరసింహులగూడెం ద్వారా చిన్నగూడూరు, కురవి మండలాల నుంచి ఖమ్మం జిల్లాకు రోడ్డు వేస్తున్నారు.
రోడ్డు కోసం నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐ)ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు గ్రామాలకు వస్తున్న క్రమంలో రైతులు అడ్డుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ కంటే భూముల విలువను తక్కువగా అంచనా వేయడం పట్ల భగ్గుమంటున్నారు. భూమికి సరైన ధర చెల్లిస్తేనే భూములు స్వాధీనం చేస్తామని పట్టుబడుతున్నారు.
వందల రైతులకు నష్టం
ఆఫీసర్లు ప్రభుత్వ వాల్యూ ప్రకారం ఎకరానికి రూ.11.50లక్షలుగా అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి రూ.30లక్షల వరకు ఉంది. రైతులు ఇంత తక్కువ ధరకు భూములు ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. సర్వే సమయంలో పైపు లైన్లు, వ్యవసాయ బావులు, మామిడి తోటలకు మాత్రమే అదనపు చెల్లింపులు ఉంటాయని ఆఫీసర్లు తెలుపుతున్నారు. కేసముద్రం మండలంలో 194 మంది రైతులు 19 ఎకరాలను, ఇనుగుర్తి మండలంలో 106 మంది రైతులు 17 ఎకరాలు, నెల్లికుదురు మండలంలో 206 మంది రైతులు 20 ఎకరాల భూములను కోల్పోతున్నారు. చిన్నగూడూరు, కురవి మండలాల్లో సర్వే జరుగవలసి ఉంది.
కోర్టులను ఆశ్రయిస్తున్న రైతులు
ప్రత్యక్ష ఆందోళనలకు దిగిన రైతులు తమకు న్యాయం జరగడం లేదని పలువురు రైతులు పరిహరం పెంపు కోసం కోర్టు కు వెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో సర్వేలను అడ్డుకోవడం, కోర్టులను ఆశ్రయించడం మూలంగా రోడ్డు సర్వే పనులు మరింతగా ఆలస్యం కానున్నాయి. కాంట్రాక్ట్ పనులను దక్కించుకున్న సంస్థలు వేసవిలో పనులను స్టార్ట్ చేయడం కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. రైతులకు సరైన భూ పరిహరం చెల్లించిన తరువాతే రోడ్డు సర్వే పనులను , హద్దురాళ్లను ఏర్పాటు చేసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.