
- గద్వాల జిల్లా త్యాగదొడ్డి సబ్స్టేషన్ ముట్టడి
- వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
గద్వాల, వెలుగు : 24 గంటల కరెంట్ కోసం రైతులు, ధర్నాలు రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు చాలా చోట్ల రైతులు కరెంటు కోసం వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేసినా మార్పు రాకపోవడంతో తాజాగా ధరూర్ మండల పరిధిలోని త్యాగదొడ్డి సబ్ స్టేషన్ ను రైతులు గురువారం ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సబ్ స్టేషన్ పరిధిలోని నెట్టెంపాడు, మాల్ దొడ్డి, గార్ల పాడు, త్యాగదొడ్డి గ్రామాల్లో15 రోజుల నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండడంతో వేరుశనగ, మిరప పత్తి పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఆఫీసర్లను అడిగినా స్పందించకపోవడంతో ఆవేదనతోనే సబ్ స్టేషన్ ముందు ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.
రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ కరెంటు గురించి అబద్ధాలాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. సర్కారు 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతోందని, మరి ఆఫీసర్లు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ దగ్గర కనీసం 10 గంటల కూడా రావడం లేదన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్, హనిమి రెడ్డి, బీజేపీ సీనియర్ లీడర్లు మిర్జాపురం రామచంద్రరెడ్డి, సుధాకర్ రెడ్డి,రాఘవేంద్ర,మహానంది,పాండు,తిమ్మారెడ్డి, బసి రెడ్డి, అది మల్లారెడ్డి ఉన్నారు.