అగ్రి చట్టాలపై నిరసన..నెల రోజులైనా తెగుతలేదు

అగ్రి చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్రి చట్టాలపై రైతులు నెల రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టి నిరసనలు తెలుపుతున్నారు. ఈ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్రం చెబుతున్నా.. తమ హక్కులన్నీ కార్పొరేట్ దయాదాక్షిణ్యం మీద ఆధారపడే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల అనుమానాలను క్లారిఫై చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలకు రావాలని రైతు సంఘాలకు కేంద్ర మంత్రులు పిలుపునిస్తున్నారు. కానీ గతంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలోని కమిటీతో జరిగిన చర్చల్లో కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటేనే తమ నిరసనలు విరమిస్తామని రైతు సంఘాలు తేల్చి చెప్పేశాయి. చట్టాల్లో కొన్ని  సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతున్నా.. రైతులు ససేమిరా అంటున్నారు. రైతులకు మేలు చేసేందుకే ఈ  చట్టాలు తెచ్చామని, వాటిని రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ సమస్య ఎటూ తేలడం లేదు. అయినా మరోసారి చర్చలకు వస్తే చట్టాలపై రైతులకు ఉన్న అపోహలు తొలగించేందుకు ఓపెన్ మైండ్ తో ఆహ్వానిస్తున్నామని కేంద్రం రైతు సంఘాలకు పిలుపునిచ్చింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తూ మోడీ సర్కారు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టాలను తెచ్చింది. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు ‘డిల్లీ ఛలో’ పేరుతో నిరసనలకు దిగారు. భారీగా ట్రాక్టర్లలో బయలుదేరి, వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకుని నిరసనలు తెలుపుతున్నారు. డిసెంబర్ 26తో ఈ నిరసనలు మొదలై నెల రోజులవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అంతా రైతులను చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. రైతులను ప్రతిపక్షాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టిస్తున్నాయని  శుక్రవారం నాడు కిసాన్ సమ్మాన్ స్కీమ్  రూ.18 వేల కోట్లను రైతుల అకౌంట్ లో డిపాజిట్ చేసే కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ అన్నారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని అపొజిషన్ పార్టీలను ఆయన హెచ్చరించారు. చర్చలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, కొత్త అగ్రి చట్టాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మరి ఈ సమయంలో రైతులు, రైతు సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. చట్టాలపై అవగాహన పెంచేందుకు.. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సభలతో పాటు వర్చువల్​ మీటింగ్​లతో రైతులు, ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. ఇందులోభాగంగా కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే వర్చువల్​ మీటింగ్​లకు కూడా అటెండ్​ అవుతూ ప్రభుత్వ వాదనను, చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఒకవైపు ప్రజలను, రైతులను చైతన్యపరుస్తూనే మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను, విమర్శలను తిప్పికొడుతున్నారు. కొన్ని సంఘాలు సానుకూలం రైతులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటేనే చర్చలకు వస్తామని చెబుతున్నారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలను మరింత తీవ్రం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే దేశంలో అతి పెద్ద రైతు సంఘాల్లో ఒకటైన ఆలిండియా కిసాన్ కో ఆర్డినేషన్ కమిటీ సహా 10 వేర్వేరు సంఘాలు మాత్రం ఇప్పటికే నిరసనలను విరమించాయి. కేంద్రం సూచించిన సవరణలతో రైతులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చాయి. రైతులకు మేలు జరిగే సంస్కరణలకు తాము మద్దతు తెలుపుతున్నట్లు చెప్పాయి. ఒకటి రెండేండ్లు చూడండి ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఒకటి రెండేండ్లు అమలు చేయనివ్వండి. కొత్త చట్టాలను ఒక ఎక్స్ పరిమెంట్ గా చూడండి. అప్పటికీ ఆ చట్టాలతో లాభం లేదంటే.. అవసరమైన అన్ని సవరణలూ చేస్తాం. ప్రధాని మోడీ ఆలోచన కూడా ఇదే. చర్చలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి. రైతులతో చర్చలు కొనసాగించాలని ప్రధాని కూడా కోరుకుంటున్నారు. రైతులంతా చర్చలకు ముందుకు రావాలి. మీరు (రైతులు) కోరుకుంటే నిపుణులతో కూడా చర్చలకు సిద్ధం. అగ్రి చట్టాలపై నిరసనలు తెలుపుతున్న వాళ్లంతా రైతుబిడ్డలే, వాళ్లందరినీ మేం గౌరవిస్తున్నాం. కనీస మద్దతు ధర ఉండబోదంటూ ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నయి. నేనూ రైతు బిడ్డనే. రైతులకు నష్టం కలిగించే పనిని ప్రధాని మోడీ సర్కార్ ఎన్నటికీ చేయబోదని హామీ ఇస్తున్నా. – రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మద్దతు ధరపై తప్పుడు ప్రచారం క‌నీస మ‌ద్దతు ధ‌ర‌పై ప్రతిప‌క్షాలు రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి.  ఎంఎస్సీ ప్రకటించే వ్యవస్థ ఎప్పటికీ ఉంటుంది. కొత్తగా తెచ్చిన వ్యవ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు అనుకూలంగా ఉన్నాయి.  ఎంఎస్పీ వ్యవ‌స్థను ఏ మాత్రం మార్చడం లేదు. రైతుల భూముల్ని కార్పొరేట్స్ లాక్కుంటారన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఎంఎస్పీ సహా కొత్త చట్టాల్లోని అనేక అంశాలపై ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. మోడీ ప్రధానమంత్రిగా ఉండగా రైతులకు ఎటువంటి నష్టం జరగదు. రైతు సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల సంక్షేమమే ప్రధాని మోడీ టాప్ ప్రయారిటీ. – అమిత్ షా, కేంద్ర హోం మంత్రి ఈ సంస్కరణలు మీ మేనిఫెస్టోలో లేవా? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నేను ఒక్కటే అడుగుతున్నా.. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అగ్రి సంస్కరణలను పెట్టలేదా? అవే సంస్కరణలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది.  మీరు (కాంగ్రెస్) చేయలేకపోయిన పనిని ప్రధాని మోడీ చేస్తున్నారనే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు.  ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి అపోహలొద్దు వ్యవసాయ చట్టాలపై చర్చించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. రైతులు అగ్రి చట్టాలను అపార్థం చేసుకుంటున్నారు. ఈ చట్టాలతో రైతులకు మంచే జరుగుతుంది. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిరసనలు ఆపేసి, చర్చలకు ముందుకు రావాలని కోరుతున్నా. రైతులు చర్చలకు వస్తే కొత్త చట్టాలపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఆ చట్టాలకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నా. – నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి రాహుల్.. డిబేట్​కు సిద్ధమా? అగ్రి చట్టాలతోపాటు పీఎం కిసాన్ స్కీమ్ వంటి పథకాల అమలుపై దేశంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులను కొన్ని పార్టీల నేతలు మిస్ గైడ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 15 రోజులకోసారి పబ్లిక్ లో కన్పిస్తరు. అగ్రి చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందో లేదో చర్చించేందుకు రాహుల్ ఓపెన్ డిబేట్ కు రావాలి. గత యూపీఏ పాలనతో పోలిస్తే.. ఇప్పటికే ఆ రాష్ట్ర రైతుల ఆదాయం డబుల్ అయింది. – ప్రకాశ్ జవదేకర్, కేంద్ర మంత్రి నేరుగా మాట్లాడే ధైర్యం లేదు ప్రధాని మోడీకి నేరుగా రైతులతో మాట్లాడే ధైర్యం లేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్​ల ద్వారానే వారి ముందుకు వస్తున్నారు. రూ.18 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేశామని మోడీ సర్కారు చెబుతోంది. కానీ ఆ డబ్బు మొత్తం రైతుల ఖాతాల్లోకి చేరడం లేదు. మధ్యలో కొంత మంది జేబుల్లోకి వెళుతోంది. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా రైతులతో నేరుగా మాట్లాడేందుకు మోడీ ప్రయత్నించడం లేదు. – అధిర్​ రంజన్​ చౌధురీ,కాంగ్రెస్​ సీనియర్​ నేత ఒక్క ఉపయోగం లేదు.. నష్టాలెన్నో కొత్త చట్టాలతో రైతులకు అసలు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నూతన చట్టాలతో అన్నదాతలకు ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది. కానీ, వాటి వల్ల జరిగే ప్రయోజనాలేమిటో చెప్పడం లేదు. రైతులు తమ పంటను మార్కెట్​ బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చని సర్కారు చెబుతోంది. కానీ, మార్కెట్​ బయట పంటలకు సగం రేటే వస్తోంది. అలాంటప్పుడు రైతులకు ఎలా ప్రయోజనం కలుగుతుంది. ఈ చట్టాల వల్ల రైతులకు ఒక్క మంచి జరగకపోగా.. ఎన్నో నష్టాలు మాత్రం వస్తాయి. – అరవింద్​ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు రైతులు ఇప్పటి వరకూ ఎలాంటి సంయమనం పాటించారో ఇప్పుడు కూడా దానిని కొనసాగించాలి. మొబైల్​ టవర్లకు కరెంట్ సరఫరాను రైతులు అడ్డుకోవద్దు. అలాంటి చర్యలతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఇలాంటి వాటి ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని రైతులను కోరుతున్నాను. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పంజాబ్​ ప్రజలు రైతులకు అండగా నిలుస్తున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. – అమరీందర్​సింగ్, పంజాబ్​ సీఎం కార్పొరేట్లకే లాభం పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వం చర్యల వల్ల రైతులకు పీఎం కిసాన్​ స్కీం కింద డబ్బులు రాలేదని బీజేపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఇది నిజం కాదు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయకుండా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని సీఎం మమతా బెనర్జీ ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం ఆ పని చేయకుండా రైతులను తప్పుదోవ పట్టిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం ఇలా చేస్తోంది. కొత్త అగ్రి చట్టాలు కార్పొరేట్స్​కు మాత్రమే ఉపయోగపడతాయి. కాంట్రాక్ట్​ ఫార్మింగ్​తో లాభపడేది వాళ్లే. పార్లమెంట్​లో మెజారిటీ ఉందని ఇలాంటి చట్టాలను ఇష్టానుసారంగా చేస్తోంది. – సౌగత రాయ్, టీఎంసీ ఎంపీ