ప్రస్తుత సమాజంలో పండగల ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియడం లేదు. కానీ అసలైన కొత్త సంవత్సరం అంటే ఉగాది. భారతీయ సాంప్రదాయం ప్రకారం శుక్ల పాడ్యమి రోజున సృష్టి నిర్మాణం జరిగిందని పూర్వీకుల నమ్మకమన్నారు. అదే రోజున రైతన్నలు దుక్కి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు.
ఉగాది అంటే యుగానికి ఆది. తెలుగు నూతన సంవత్సరంగా పిలిచే ఉగాది షడ్రుచుల పచ్చడితో ప్రారంభమవుతుంది. చిగురించే పచ్చని కొమ్మలతో వేప పూతలు, మామిడి పిందెలతో ఈ పండుగ వాతావరణం ఉంటుంది.
వసంత రుతువు ప్రారంభమై చెట్ల పచ్చని చిగురులు కోయిలల మధ్య నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది రోజున కొత్త పనులకు శ్రీకారం చుట్టి.. శుభకార్యాలను ప్రారంభిస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ మొట్టమొదటగా జరుపుకునే పండుగ ఉగాది .
ఉగాది రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి మట్టితో తయారుచేసిన కుండను తీసుకొని వచ్చి దాన్ని పసుపు.. కుంకుమలతో అలంకరించాలి. మామిడి ఆకులను తోరణాలు కట్టాలి. ఇంటి గుమ్మాలను పసుపు.. కుంకుమ పెట్టాలి. ఆ తరువాత ఇంట్లో దేవుడి దగ్గర ఇష్టమైన దేవతను.. కుల దేవతను పూజించాలి.
మామిడి ఆకులతో కంకణాలు తయారుచేసుకోవాలి. కంకణాలను పచ్చటి కుండకు కట్టి.. ఇంట్లోని సభ్యులందరూ కంకణాలను ధరించాలి. కొత్త చింతపండు తీసుకుని వచ్చి నీటిలో వేసి నానబెట్టి బెల్లం కలపాలి. వేప పువ్వు ,వగరుగా ఉన్న మామిడి పిందెల ముక్కలను ,కొంచెం ఉప్పు, కారం వేసి ఉగాది పచ్చడి తయారు చేసి మోదుగు ఆకులను డొప్పలు ( చిన్న పాత్రలాగా) మలచి దానిలో పోసి దేవుళ్లకు నైవేద్యంగా పెట్టాలి.
అన్నదాతలు ఉగాది రోజున ..పొలం వద్ద నూతన పనులు ప్రారంభిస్తారన్నారు. రైతులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ప్రీతికరంగా భావించే పండుగ ఉగాది అని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా వివిధ పేర్లతో ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.
జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమయమనంతో పాటించాలి. తీపి ,చేదు ,ఉప్పు, కారం, వగరు పులుపు ఈ ఆరు రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తో పాటు భక్షాలు ప్రత్యేక వంటకంగా చేసుకుంటారు. ప్రకృతి అందించిన ఈ ఔషధ గుణాలు కలిగిన వాటిని స్వచ్ఛమైన కుండలో కలిపి ప్రసాదం ( పచ్చడి) చేసి కుటుంబ సభ్యులు స్వీకరించాలి.
చిన్నపిల్లలు పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉగాది రోజున గ్రామంలోని పూజారుల వద్దకు వెళ్లి నూతన పంచాంగం ఎలా ఉంది నూతన కార్యక్రమాలు ఏ సమయంలో ప్రారంభించాలి. పట్టణాల్లో అయితే ఇంటి పురోహితుల దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకోవాలి. అలా కుదరని పక్షంలో దగ్గరలోని దేవాలయానికి వెళ్లి పూజారులకు దక్షిణ.. తాంబూలం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తరువాత భవిష్యత్తు గురించి పంచంగ శ్రవణం ద్వారా తెలుసుకోవాలి.