నాగర్‌కర్నూల్.వెలుగు: కల్వకుర్తి లిఫ్ట్ కెనాల్స్ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు ఏటా తిప్పలు తప్పడం లేదు. కూలిన దరులు, మనిషి ఎత్తు మొలిచిన పిచ్చి మొక్కల్లో కాలువలు ఎక్కడున్నయో వెతుక్కోవాల్సిన పరిస్థితి. యాసంగి పంటకు మార్చి 31 వరకే నీళ్లిచ్చి, ఆ తర్వాత కెనాల్స్ రిపేర్లు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు ఇంజనీర్లు సరేనని తలలు ఊపారు. పనులు మొదలు పెట్టి 20 ఏండ్లు దాటినా ఇంకా ఆన్‌గోయింగ్ స్టేజీలో ఉన్న ప్రాజెక్ట్ పనులు మేమెట్ల చేస్తాం.. కాంట్రాక్టర్లే చేయాలని చెబుతున్నారు.
ఏండ్లుగా రిపేర్లు పెండింగ్..
ఎల్లూరులో మూడేండ్ల కింద మునిగిన కల్వకుర్తి మొదటి లిఫ్ట్ పంపుల రిపేర్ ఇంకా పూర్తి కాలేదు. జొన్నలబొగడ లిఫ్ట్‌లో రెండేండ్ల కింద విప్పి పెట్టిన నాలుగో పంప్ రిపేర్ చేయకుండా కవర్లు కప్పి పెట్టి ఉంచారు. అయితే మూడు రోజుల కింద నిర్వహించిన ఇరిగేషన్ డేలో మాత్రం అన్ని బాగు చేశామని చెప్పుకున్నారు. ఎల్లూరు నుంచి సింగోటం రిజర్వాయర్, అక్కడి నుంచి జొన్నలబొగడ రిజర్వాయర్ నిండిన తర్వాత గుడిపల్లిగట్టుకు చేరే మెయిన్ కెనాల్ లైనింగ్ కూలిపోయి నాలుగేండ్లు దాటింది. మెయిన్ కెనాల్ ఇలా ఉంటే డిస్ట్రిబ్యూటరీలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అడ్డగోలు మళ్లింపులు..
కేఎల్ఐ ప్రాజెక్ట్‌లోని 28వ ప్యాకేజీలో 84 కిమీలు,29వ ప్యాకేజీలో 160 కిమీలు,30వ ప్యాకేజీలో 80కిమీల పొడవున కాలువలున్నాయి. 28వ ప్యాకేజీ కింద 70 వేల ఎకరాలు, 29వ ప్యాకేజీ కింద 1.80 లక్షల ఎకరాలు, 30 ప్యాకేజిలో 90 వేల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. మధ్యలో ఘన్పూర్ బ్రాంచ్ కెనాల్, పస్పుల బ్రాంచ్ కెనాల్ కింద వనపర్తి నియోజకవర్గంలోని మండలాలను కలిపారు. మెయిన్ కెనాల్ నుంచి నీటిని మళ్లించారు. దీంతో కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
కేఎల్ఐ కింద 6 లక్షల ఎకరాలు
కేఎల్ఐ కింద వానాకాలంలో 6 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి, 4.40 లక్షల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మిగిలిన పంటలు సాగవుతాయి. సాధారణ వర్షపాతం నమోదైతే రైతులు జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లపై ఎక్కువగా ఆధారపడతారు. బ్రాంచ్ కెనాల్స్, సబ్స్, మైనర్స్ ఏర్పాటు చేయకపోయినా రైతులే మెయిన్ కెనాల్ నుంచి కిలోమీటర్ల కొద్దీ పైప్లైన్లు వేసుకుని నీటిని తరలిస్తున్నారు.
వానలు ఆలస్యమైతే నాట్లకు కేఎల్ఐ ప్రాజెక్ట్ నీళ్లే దిక్కవుతాయి. ఇప్పటికే జిల్లాలోని కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో వరి. పత్తి సాగు ప్రారంభించారు. కేఎల్ఐ స్కీమ్‌లోని 3 లిఫ్టుల కింద 324 కిమీల పొడవున కెనాల్ మెయింటేనెన్స్ పనులు మూడేండ్లుగా చేయట్లేదు.
కాంట్రాక్టర్లకు రూ. 30 కోట్ల వరకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తి చేసి హ్యాండోవర్ చేయడం లేదు. ఈజీఎస్ కింద కెనాల్స్ రిపేర్ చేసేందుకు ప్రపోజల్స్ తీసుకున్న జిల్లా ఆఫీసర్లు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు వర్తించదని పక్కన పడేశారు.
ఏటా సాగు విస్తీర్ణం పెంచుతున్రు..
రిజర్వాయర్లు పెంచకుండా, కాలువలు రిపేర్ చేయకుండా ఏటా సాగు విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారు. వానాకాలంలో 6.40 లక్షల ఎకరాలకు సాగునీరందాల్సి ఉండగా, దేవరకద్ర నియోజకవర్గాన్ని చేర్చారు. అదనంగా మరో 30 వేల ఎకరాలకు సాగు నీరిస్తామని చెబుతున్నారు. 500 చెరువులు నింపేందుకు, డైరెక్టుగా పొలాలకు నీరందించే సిస్టం లేకపోవడంతో రైతులు కాలువలకు మోటార్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. 28,29,30 ప్యాకేజీ కింద 21 వేల పంప్సెట్లు పని చేస్తున్నట్లు అంచనా. ఎల్లూరు నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నుంచి కల్వకుర్తి, వనపర్తి వరకు కాలువల పక్కనున్న రైతులంతా మోటార్లు పెట్టుకుని నీటిని తరలించుకుంటున్నారు.
ఇలా రైతులు పంటలకు సాగు నీరందించేందుకు మోటార్లు పెట్టుకొని వేలకువేలు నష్టపోతున్నారు. కోడేరు, బిజినేపల్లి, తాడూరు, తెల్కపల్లి, మిడ్జిల్, కల్వకుర్తి, ఉప్పునుంతల మండలాల్లో రైతులంతా పైప్లైన్లు వేసుకొని, బావులను లీజుకు తీసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కేఎల్ఐ కెనాల్స్ రిపేర్లు, మిగిలిన పనులు కంప్లీట్ చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.