చిన్నబోయిన జొన్నరైతు .. సిండికేట్​గా మారి దగా చేస్తున్న సీడ్​ కంపెనీలు

చిన్నబోయిన జొన్నరైతు .. సిండికేట్​గా మారి దగా చేస్తున్న సీడ్​ కంపెనీలు
  • గతంలో ఎర్రజొన్న క్వింటాల్ ధర రూ.4200
  • గుజరాత్​లో జరిగిన సమావేశంలో రూ.36‌‌‌‌‌‌‌‌00గా తీర్మానం
  • ఢిల్లీ నగరంలో రూ.3 వేలకే క్వింటాల్​ అంటూ మాయమాటలు
  • క్వింటాలుకు రూ.600 ధర తగ్గింపు.. ఎకరానికి సుమారు రూ.15వేలు నష్టం
  • ఆందోళన చెందుతున్న జొన్న రైతులు
  • జిల్లాలో 26 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగు

నిజామాబాద్, వెలుగు :  ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు రాక ఎర్రజొన్న రైతు చిన్నబోతున్నాడు. భూమి చదును, విత్తనాలు, ఎరువులకని తెచ్చి పెట్టిన పెట్టుబడి గిట్టని పరిస్థితి. జిల్లాలో సీడ్​ కంపెనీలు సిండికేట్​ అయ్యాయి.  జిల్లాలో సీడ్​ కంపెనీలు ఉండగా, గుజరాత్​లో నిర్వహించిన సమావేశంలో 15 కంపెనీల యజమానులు మాత్రమే పాల్గొని ఎర్రజొన్న క్వింటాల్​కు రూ.  3,600  ధర ఇవ్వాలని తీర్మానించారు. 

దీంతో రూ.600 ధర తగ్గించి రైతన్న శ్రమను దోచేశారు.  సీజన్ ప్రారంభంలో వ్యవసాయ అధికారుల సమక్షంలో ఈ తతంగమంతా జరిగింది.గతేడాది ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యే సమయంలో  కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు సీడ్​ కంపెనీల యజమానులతో మాట్లాడి  ఎర్ర జొన్న క్వింటాలుకు రూ.4,200 ధర ఇవ్వాలని సూచించారు.

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి..

జిల్లాలోని ఆర్మూర్ డివిజన్​లో యాసంగి సీజన్​లో సుమారు 26 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగైంది. 20 రోజుల  నుంచి పంటను కోస్తున్నారు.  జొన్నలను మూల విత్తనాలుగా, పౌల్ర్టీ పరిశ్రమలకు దాణాగా వినియోగిస్తున్నారు.  పశుగ్రాసం కోసం  ఫౌండేషన్​ సీడ్​ను  ​బీహార్​, పంజాబ్​, రాజస్థాన్​, యూపీ, ఎంపీ రాష్ట్రాలకు రవాణా చేస్తారు.  కర్నాటకలోని బళ్లారి, ఢిల్లీ నగరం ఎర్ర జొన్నలకు డిమాండ్​ ఉన్నది.  ఎర్ర జొన్నల కోసం  ఆర్మూర్​ ప్రాంతంలో 35 సీడ్​ కంపెనీలు ఏర్పడ్డాయి.  ఏటా అగ్రికల్చర్​ ఆఫీసర్ల మధ్యవర్తిత్వంతో రైతులతో ఒప్పందం చేసుకుని విత్తనాలను అందజేస్తారు.

  ఢిల్లీ నగరంలో రూ.3 వేలకు ఎర్రజొన్నలు లభిస్తున్నాయని, అంతకంటే ఎక్కువే చెల్లిస్తున్నామంటూ సీడ్​ కంపెనీల యజమానులు రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఎర్రజొన్న ఎకరానికి 22 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.  తగ్గించిన ధర వల్ల ఎకరానికి దాదాపు రూ.15వేల నష్టం వస్తున్నది.  ఆర్మూర్​ డివిజన్​లో సుమారు 6 వందల ఎకరాల్లో తెల్లజొన్న సాగైంది.

అధికారులు స్పందించాలి..

మూడు ఎకరాల్లో ఎర్రజొన్న పంట సాగు చేసినా. క్వింటాలుకు రూ.600 తగ్గించడంతో దాదాపు రూ.40వేల నష్టం వస్తున్నది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరేటట్టు లేవు. వ్యవసాయ అధికారులు స్పందించి న్యాయం చేయాలి. 

అల్లూరి గంగారెడ్డి, పెర్కిట్(ఎర్రజొన్న రైతు)

నిండా ముంచుతుండ్రు..

సీడ్​ కంపెనీల యజమానులు సిండికేట్​గా మారి నిండా ముంచుతుండ్రు. కష్టపడి పంట పండిస్తే పెట్టుబడి అయినా వచ్చేటట్టు లేదు. వ్యాపారులు ఎర్రజొన్నకు రేటు తగ్గించి రూ.కోట్లు దండుకుంటున్నరు. ఢిల్లీ, బళ్లారి మార్కెట్​లో ధర తక్కవంటూ సాకులు చెబుతున్నరు.

నర్సయ్య, మగ్గిడి(ఎర్రజొన్న రైతు)