మాకు పోడు పట్టాలెందుకు ఇయ్యలే?

  • అశ్వరావుపేట ఎమ్మెల్యేను నిలదీసిన పోడు రైతులు  
  • అర్హత ఉన్నా రాలేదని ఆవేదన  
  • ప్రొటోకాల్​ పాటించలేదని  సర్పంచ్, వైస్​ సర్పంచ్ ​​లొల్లి 

చండ్రుగొండ, వెలుగు : తమకు అర్హత ఉన్నా  పోడు భూముల పట్టాలివ్వలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావును పోడు రైతులు నిలదీశారు. చండ్రుగొండ మండలంలోని వెంకటయ్య తండా, రావికంపాడులో  పోడు భూముల పట్టాలను బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేయడానికి వచ్చారు. బెండాలపాడు, గుర్రాయిగూడెం, రావికంపాడు గ్రామాలకు చెందిన పోడుదారులకు 263 పట్టాలు అందజేస్తున్నారు. 

ఈ సమయంలో తాము అర్హులమైనా పట్టాలు రాకుండా చేశారని ఆరోపిస్తూ పలువురు పోడు రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. సర్వే చేసిన వారికి ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముడుపులు చెల్లించి పలువురు పట్టాలు పొందారని, అర్హులైన తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేసే సమయంలో గుంపుగా ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారు. దీంతో గ్రామానికి ఒకరిద్దరికి పట్టాలిచ్చి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

ప్రొటోకాల్ రగడ 

వెంకటయ్య తండాలో పట్టాల పంపిణీ సందర్భంగా తమకు ఆహ్వానం లేదని, ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించలేదని సర్పంచ్ బాలాజీ, వైస్ సర్పంచ్ బాబూలాల్ గొడవ చేశారు. తహసీల్దార్​ రవికుమార్, ఎంపీడీవో రేవతి, ఎస్సై విజయలక్ష్మి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఎమ్మెల్యేను బాలాజీ ప్రశ్నించారు. ఆహ్వానించడం తన పని కాదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని, చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సూచించారు. చివరకు శాంతించిన సర్పంచ్ కార్యక్రమంలో పాల్గొనడంతో వివాదం సద్దుమణిగింది.