డిమాండ్లపై కేంద్రానికి వారం గడువిచ్చిన రైతులు
అంతకు ముందు నోయిడాలో కదం తొక్కిన రైతు సంఘాలు
ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కి.మీ. ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇతర జిల్లాల రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ వారం పాటు వాయిదా పడింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ పరిషత్ నాయకుడు సుఖ్బీర్ ఖలీఫా తదితరులు.. నోయిడా, యమునా అథారిటీ అధికారులతో సోమవారం సాయంత్రం సూదీర్ఘ సమావేశం నిర్వహించారు. డిమాండ్లను నెరవేర్చేందుకు అధికారులు వారం రోజుల గడువు కోరగా..దానికి రైతులు అంగీకరించారు.
ఎంఎస్‌పీకి చట్టబద్ధతతో సహా తమ ఇతర డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రానికి ఒక వారం గడువు ఇస్తున్నట్లు రైతులు ప్రకటించారు. ఈ వారం రోజులు నోయిడాలోని దళితుల ప్రేరణ స్థల్‌లో వేచి చూస్తామని తెలిపారు. అప్పటికీ తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఢిల్లీ మార్చ్ మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ మార్చ్ వాయిదా పడటంతో పోలీసులు రోడ్లపై వేసిన బారికేడ్లను తొలగించి వాహనాల రాకపోకలను ప్రారంభించారు. దాంతో నోయిడా-– గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ఏర్పడిన ట్రాఫిక్ క్రమక్రమంగా తగ్గింది.
బారికేడ్లను బద్దలు కొట్టిన రైతులు
ఢిల్లీ మార్చ్ లో భాగంగా.. సోమవారం మధ్యాహ్నం నోయిడా నుంచి ఢిల్లీకి వేలాది మంది రైతులు కాలినడకన, టాక్టర్లతో పయనమయ్యారు. వారిని దారి మళ్లించేందుకు, ఎక్కడికక్కడ అదుపు చేసేందుకు పోలీసులు దారిపొడవునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులంతా ఒక్కసారిగా రోడ్లమీదికి రావడం, రోడ్లన్ని బారికేడ్లతో నిండిపోవడంతో నోయిడాలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నోయిడా-–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఏకంగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ఢిల్లీ–నోయిడా సరిహద్దులో బారికేడ్లు వేశారు. అయినా రైతులు మహామాయ ఫ్లైఓవర్ సమీపంలోని బారికేడ్లను బద్దలు కొట్టి మరీ మార్చ్ కొనసాగించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ నిరసనలో కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎం), ఇతర రైతు సంఘాలు పాల్గొన్నారు. నోయిడాలోని చిల్లా బోర్డర్ వద్ద కూడా వందలాది మంది రైతులు నిరసన తెలిపారు.