చౌటుప్పల్ వెలుగు : దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం దివిస్ ఫార్మా కంపెనీ ఎదుట ఆరెగూడెం రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ గేటు ఎదుట ప్లకార్డులతో ధర్నాకు దిగి కంపెనీ ఎంప్లాయిస్ ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివీస్ పరిశ్రమలో సుమారు 10 బోర్లకు పైగా 500 మీటర్ల లోతు వేసి అందులో వ్యర్థ రసాయనాలను పంపిస్తున్నారని ఆరోపించారు.
దీంతో ఆరెగూడెం గ్రామ పరిధిలో పంట పండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కెమికల్ తో కలుషితం కావడంతో పశువులు ఆ నీరుతాగి చనిపోతున్నాయని వాపోయారు. గతంలో పలుమార్లు కలెక్టర్, పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు దివిస్ పరిశ్రమను పరిశీలించి రసాయనాలు వదులుతున్న బోర్లను మూసివేసి రైతులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బద్దం అంజయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.