రోడ్డెక్కుతున్న మక్క రైతులు.. కొనుగోలు చేస్తామంటున్న ఆఫీసర్లు

రోడ్డెక్కుతున్న మక్క రైతులు.. కొనుగోలు చేస్తామంటున్న ఆఫీసర్లు

 

  •  టార్గెట్​ మేరకే కొనుగోలు చేస్తామంటున్న ఆఫీసర్లు
  •  పండించిన మొత్తం పంటను కొనాలని రైతుల డిమాండ్
  •  దిగుబడులు లక్షల క్వింటాళ్లు.. కొనుగోళ్లు వేల క్వింటాళ్లు 

గద్వాల, వెలుగు:  ఆరుగాలం కష్టపడి పండించిన మక్కలను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల క్వింటాళ్ల దిగుబడులు రాగా.. కొనుగోళ్లు వేల క్వింటాళ్లు దాటడం లేదు. దీంతో రైతన్నలు ఆగ్రహిస్తున్నారు. పండించిన మొత్తం పంటను కొనాల్సిందేనని డిమాండ్​చేస్తూ రోడ్డెక్కుతున్నారు. కొంటున్న ఆ కాస్త పంటకు కూడా తేమ శాతం ఎక్కువగా ఉందని, హమాలీలు రావడం లేదని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.  దీంతో తప్పని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు దళారులను ఆశ్రయిస్తున్నారు.

35 వేల ఎకరాల్లో సాగు

జోగులాంబ గద్వాల జిల్లాలో 16290 మంది రైతులు దాదాపు 35 వేల ఎకరాల్లో మక్క పంట వేశారు.  విత్తనాల కొనుగోలు, మందుల పిచికారీ తదితరాల వాటి కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశారు. ఎకరాకు దాదాపు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకుంటేనే కాస్తయినా మిగులుతుంది. అదే దళారులకు అమ్మితే.. వచ్చే నాలుగు రూపాయలు రావు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

1.04 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి

జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి, రాజోలి, గద్వాల, ఆలంపూర్​, మానవపాడు, ధరూర్, ఉండవల్లి, అయిజ మండలాల్లో రైతులు అధికంగా మక్క సాగు చేశారు.  జిల్లాలో సాగుచేసిన 35 వేల ఎకరాల్లో 1.04 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కలు పండుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు.

టార్గెట్​21,170 మెట్రిక్ టన్నులు

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా 21,170 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. 
ఇదే పండిన పంటలో 20 శాతం మాత్రమే. నిర్ధేశించుకున్న లక్ష్యంలోనూ ఇప్పటివరకు కేవలం 1400 మెట్రిక్ టన్నులు (14 వేల క్వింటాళ్లు) మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా పెద్దమొత్తంలో కొనుగోలు చేయాల్సి ఉంది.

కొనుగోలు కేంద్రాల వద్ద దోపిడి

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు దోపిడికి గురవుతున్నారు. హమాలీ, ట్రాన్స్ పోర్ట్, ఇతర ఖర్చులు అంటూ క్వింటాలు మక్కలకు పంట వెనుక రూ.65 వసూలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తమ మక్కలను కొనుగోలు చేయరేమోననే భయంతో రైతులు కూడా డబ్బులు ఇస్తున్నారు. 

అగ్గువకే అమ్మినా..

నేనే 10 ఎకరాల్లో మక్క పంట వేసిన. కొనుగోలు కేంద్రం లేక పండించిన పంటను తక్కువ ధరకే కోళ్ల పరిశ్రమ కంపెనీకి అమ్ముకున్న. ప్రభుత్వం మిగతా రైతులనైనా ఆదుకోవాలి.
- భీమ శేఖర్ రెడ్డి, రైతు మానవపాడు

ఇబ్బందులు లేకుండా చూస్తాం

ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం మక్కలు కొనుగోలు చేస్తాం.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. చాలామంది రైతులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు. టార్గెట్ తక్కువ ఉన్నా మళ్లీ పర్మిషన్ తీసుకుంటాం.
- భాస్కర్​రెడ్డి, మార్క్ ఫెడ్ డీఎం