- మిర్చి రేటు తగ్గి నష్టపోతుండడమే కారణం
- గిట్టుబాటు ధర ఇవ్వాలంటున్న రైతు సంఘాలు
- మద్దతు ధరపై ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్లు
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోనే మిర్చి పంటకు ఖమ్మం జిల్లా కేరాఫ్అడ్రస్గా నిలుస్తుంది. ఇక్కడి తేజా రకం మిర్చికి అంతర్జాతీయంగా కూడా డిమాండ్ఉంది. ప్రతి ఏటా రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఎగుమతులు జరిగేవి. కానీ.. ఈ ఏడాది మాత్రం మిర్చి రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వైరస్లు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గిపోయింది. రేటు కూడా పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు.
వ్యాపారులు, ట్రేడర్లు మాత్రం అంతర్జాతీయ ఆర్డర్లు లేకపోవడంతోనే రేటు తగ్గుతుందని చెబుతున్నారు. దీంతో వాణిజ్య పంట అయిన మిర్చిని మిగిలిన వాణిజ్య పంటలకు కల్పించినట్టుగానే ప్రత్యేక బోర్డును ఏర్పా టు చేయాలనే డిమాండ్పెరుగుతోంది. ప్రస్తుతం స్పైసెస్బోర్డులో మిర్చి భాగంగా ఉండగా, పసుపు తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 25 వేల నుంచి పడిపోయిన ధర
రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లో మిర్చిని ఎక్కువ మంది రైతులు సాగు చేస్తారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మూడేండ్ల కింద క్వింటా రూ.25 వేలు పలికింది. ఇప్పుడు రూ.14 వేలకు పడిపోయింది. ఈ రేటు కూడా జెండా పాట దక్కిన ఒకట్రెండు లాట్లకు మాత్రమే పెడుతున్నారు. సగటు ధర రూ.12 వేల కంటే తక్కువగానే నమోదవుతోంది. రైతుల అవసరాల దృష్ట్యా రూ.10 వేలకు అమ్ముకుంటున్నారు. కొన్నేండ్ల కింద ఖమ్మం జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అయ్యేంది.
ఈ ఏడాది దాదాపు 90 వేల ఎకరాల్లోనే పంట వేశారు. సీజన్ ప్రారంభంలో ఎక్కువగా కురిసిన వర్షాలతో తోటలు దెబ్బతిన్నాయి. ఒకటికి రెండు సార్లు మొక్కలు నాటుకోవాల్సి రావడంతో, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. ఎరువులు, పురుగు మందులకు ఒక్కో రైతు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. ఇంత చేసినా దిగుబడి మాత్రం అంతంత మాత్రమే వచ్చింది. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే మిర్చి తోటలు, ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా రాలేదు. దీంతో దిగుబడి లేకపోవడంతో రైతుకు కన్నీళ్లే దిక్కయ్యాయి.
వాణిజ్య పంట అయినా బోర్డు లేకపోగా..
వాణిజ్య పంటలైన పొగాకుకు టొబాకో బోర్డు ఉంది. ఆయిల్ పామ్ధర పతనం కాకుండా, రైతులను ప్రోత్సహించడాన్ని ఆయిల్ ఫెడ్ పర్యవేక్షణ చేస్తుంది. పత్తిని కొనుగోలు చేసేందుకు కాటన్కార్పొరేషన్ఆఫ్ఇండియా(సీసీఐ)ఉన్నట్టే, మిర్చికి కూడా ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా కందులు, మొక్కజొన్నలు, పెసల పంటలను కొంటున్నట్టుగానే కూడా మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు.
మార్క్ఫెడ్, నాఫెడ్ కొనేలా చట్టం తేవాలి
అప్పులు చేసి, కష్టపడి మిర్చి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పసుపు బోర్డు తరహాలోనే ప్రత్యేక మిర్చి బోర్డును ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మిర్చికి పెట్టుబడులు బాగా పెరిగిపోగా.. దిగుబడులు తగ్గాయి. బహిరంగ మార్కెట్ లో పంటకు ధర పెట్టకుం డా రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారు. కేంద్రం కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేసి మార్క్ఫెడ్, నాఫెడ్ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలి.
– నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి
బోర్డు కాదు.. మద్దతు ధర ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్పైసెస్బోర్డులో మిర్చి కూడా ఉంది. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయంగానే ఉపయోగపడుతుంది. రైతులకు ఎలాంటి మేలు జరగదు. రైతులకు న్యాయం జరగాలంటే గిట్టుబాటు ధరకు పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. మిర్చికి కూడా కనీస మద్దతు ధర నిర్ణయించాలి.
– నల్లమల వెంకటేశ్వరరావు, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు