అగ్రి చట్టాలను రద్దు చేస్తరా.. లేదా? ఎస్ ఆర్ నో

ఇంకేం వినేది లేదని తేల్చిచెప్పిన రైతులు

చర్చల నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరికలు

బుజ్జగించిన మంత్రులు.. టైం ఇవ్వాలని విజ్ఞప్తి

9న మరోసారి భేటీ కావాలని నిర్ణయం

8న భారత్ బంద్ కొనసాగుతుందన్న రైతు సంఘాలు

న్యూఢిల్లీ: రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబట్టడం, కేంద్రం అందుకు నిరాకరించడంతో మీటింగ్​లో క్లారిటీ రాలేదు. ఒకానొక సందర్భంలో కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఒప్పుకుంటారా? లేదా? అని రైతులు నిలదీశారు. ఎస్​ఆర్ నో చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇంకేం వినేది లేదని స్పష్టంచేశారు. మీటింగ్​లో చాలా సేపు మౌనంగా కూర్చున్నారు. అర్థం పర్థం లేని చర్చలు ఎందుకని, తమ డిమాండ్లు నెరవేర్చకుంటే చర్చల నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో రైతులను బుజ్జగించిన మంత్రులు చర్చలు కొనసాగించాలని కోరారు. మరిన్ని ప్రతిపాదనలతో వచ్చేందుకు కొంచెం టైం ఇవ్వాలని, ఈనెల 9న మరోసారి సమావేశం అవుదామని కోరారు. దీనికి రైతు సంఘాల నాయకులు అంగీకరించారు. కాగా, గురువారం మాదిరే శనివారం కూడా రైతులు వాళ్ల భోజనం, టీ వాళ్లే  తెచ్చుకున్నారు.

పిల్లలు, పెద్దలను ఇండ్లకు పంపండి

శనివారం మధ్యాహ్నం 2.30 సమయంలో 40 సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ భేటీ అయ్యారు. ప్రొటెస్టులు చేస్తున్న ప్రాంతాల నుంచి సీనియర్ సిటిజన్లు, పిల్లలను ఇండ్లకు పంపాలని రైతులను తోమర్ కోరారు. రైతుల ఆందోళనలను పరిష్కరిస్తామని, వారిపై పెట్టిన కేసులను కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొటెస్టుల బాట విడిచిపెట్టి.. చర్చలు జరపాలని కోరారు. తాము రైతుల ఆందోళనలను వినేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వారి ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇకపైనా ఉంటుందని తెలిపారు. ఆందోళనల సందర్భంగా క్రమశిక్షణతో ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పారు. రైతుల సహకారంతో ఏకాభిప్రాయానికి వస్తామని అన్నారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని, మండీలను మరింత శక్తిమంతం చేస్తామని వెల్లడించారు. 8న నిర్వహించనున్న భారత్ బంద్​ను వాయిదా వేయాలని తోమర్ కోరగా.. అందుకు రైతులు నిరాకరించారు. బంద్ కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది.

టిక్రి బార్డర్.. ఇప్పుడో ఊరు

ట్రాక్టర్లపై టెంట్లు.. కూరగాయలు తరుగుతున్న రైతులు.. పొయ్యి మీద ఉడుకుతున్న కూర.. ఫోన్లను చార్జ్ చేసుకునేందుకు సోలార్ ప్యానెల్స్.. మెడికల్ క్యాంపులు, హుక్కాలు.. ఇవీ టిక్రి బార్డర్​లో కనిపిస్తున్న సీన్స్. ఒకప్పుడు ట్రాఫిక్.. పొగతో, హార్న్​ల శబ్దాలతో గజిబిజిగా ఉండే సరిహద్దు.. ఇప్పుడు ఓ ఊరుగా మారిపోయింది. ఆందోళనలు చేస్తున్న రైతులకు ఇల్లు అయింది. ‘‘ఇది సుదీర్ఘ పోరాటం కాబోతోంది. దీంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో మా ఇల్లు కానుంది. మేము ఇక్కడే ఉంటున్నాం” అని పంజాబ్​లోని మాన్సా జిల్లా నుంచి వచ్చిన 50 ఏళ్ల గురునాం సింగ్ చెప్పారు. తమ దగ్గర కనీసం ఆర్నెల్ల నుంచి ఏడాదికి అవసరమైన సరుకులు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ప్రతి రోజూ 5 వేల మంది భోజనం వండుతున్నారు. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే వారికీ  బువ్వ పెడుతున్నారు. ఇక్కడ రోడ్డుపై 500కు పైగా ట్రాక్టర్లు ఒకదాని వెనుక ఒకటి నిలబడి ఉన్నాయి. వాటికి ‘నో ఫార్మర్.. నో ఫుడ్.. నో జీడీపీ.. నో ఫ్యూచర్’ అని రాసి ఉన్న పోస్టర్లు అతికించారు.

ప్రధానితో కేంద్ర మంత్రుల భేటీ

రైతులతో మీటింగ్​కు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ తదితరులు భేటీ అయ్యారు. ఐదో రౌండ్ చర్చల సందర్భంగా రైతుల ముందుంచాల్సిన ప్రతిపాదనలపై మాట్లాడుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైతుల ఆందోళనలు మొదలయ్యాక కేంద్ర మంత్రులతో ప్రధానితో మీటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.

For More News..

డాక్యుమెంట్లులేని విదేశీయులను దేశం నుంచి వెళ్లగొట్టొద్దు

గ్రేటర్‌లో గులాబీ అంచనాలు తలకిందులు

ఐటీ కారిడార్​లో బీజేపీ బోణీ