- క్వింటాలుకు అదనంగా 5 కిలోల తూకం
- లబోదిబోమంటున్న రైతులు
- మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం
జైపూర్, వెలుగు: ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు రైతులను నిండా ముంచుతున్నారు. అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతుండడంతో జైపూర్ మండలంలో ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు వేసిందే తూకం..చెప్పిందే వేదంగా మారింది. ఆరుగాలం కష్టపడి గిట్టుబాటు ధర కోసం ధాన్యం అమ్ముకోవడానికి వస్తే తరుగు పేరుతో బస్తాలో ఎక్కువ తూకం వేస్తున్నారు. జైపూర్ మండలం షెట్పల్లిలోని ఐకేపీ, కుందారం గ్రామంలోని డీసీఎస్ ఎంఎస్ ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఇన్చార్జీలు రైతుల నుంచి వడ్లు కొంటూ బస్తాలో 41 కిలోలు నింపాల్సిన చోట.. 42, 43 కిలోలు నింపుతున్నారు. ఇలా క్వింటాలుకు 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే వడ్లలో తేమ, గడ్డి, మట్టి బెడ్డలు ఉన్నాయని చెప్తున్నారు. సెంటర్ల ఇన్చార్జిలు,మిల్లర్లు కుమ్మకై ఇలా తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సెంటర్లలో పనిచేయని ఎలక్ట్రానిక్ కాంటాలు
కొనుగోలు సెంటర్లలో ధాన్యం తూకం వేసే ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా సరిగా పనిచేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో నిర్వాహకులు ఎక్కువ తూకం వేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. షెట్పల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లో తూకం వేసి ఉన్న ఓ గన్నీ బ్యాగ్ ను మళ్లీ తూకం వేస్తే 42 కిలోల ధాన్యం చూపించింది. కుందారం డీసీఎంఎస్ సెంటర్లో హమాలీలు ఒక గన్నీ బ్యాగ్ లో 42.5 కిలోల ధాన్యాన్ని కాంటా వేస్తూ, క్వింటాలుకు 5 కిలోల తరుగు తీస్తున్నారని శ్రీకాంత్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తరుగు వ్యవహారంపై డీఆర్ డీఏ ఆఫీసు కమ్యునిటీ కోఆర్డినేటర్ దీపక్ ఠాకూర్ ను వివరణ కోరగా.. షెట్పల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ ను పరీశిలించి ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సివిల్సప్లయ్ఆఫీసర్ల బ్యాక్మెయిల్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయకుండా, రైతులను మోసం చేయకుండా చూడాల్సిన సివిల్సప్లయ్ఆఫీసర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుల వద్ద ఎక్కువ తరుగు తీస్తున్నారని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మెంట్ లో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్, మరో ఉన్నతాధికారి ఇద్దరూ కలిసి ధాన్యం కొనుగోలు సెంటర్ఇన్చార్జ్లను బెదిరిస్తూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
రైస్ మిల్లర్ల పేరు చెప్పి మోసం
కొను గొలు కేంద్రానికి తెచ్చిన వడ్లను తాలు, తరుగు పేరుతో ఒక గన్నీ బ్యాగ్లో 41 కిలోలు కాంటా వేయాల్సి ఉండగా 42 కిలోలకు పైగా ధాన్యాన్ని కాంటా వేశారు. ఇదేందని సెంటర్ ఇన్చార్జిని అడిగితే.. బస్తాకు రెండు నుంచి మూడు కిలోల ధాన్యం ఎక్కువ కాంటా వేస్తేనే రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దింపుకుంటారని చెప్తున్నారు.
దండవేన శ్రీకాంత్, యువ రైతు, కుందారం
మోసం చేస్తే సెంటర్ను రద్దు చేస్తాం
మిల్లర్లతో మాకు ఎటువంటి సంబంధం లేదు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఒక గన్ని బ్యాగులో తరుగు కింద ఒక కిలో ధాన్యం మాత్రం తీయాలి. సెంటర్ ఇన్చార్జీలు రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకొని సెంటర్ను రద్దు చేస్తాం.
లింగన్న, చైర్మన్, డీసీఎంఎస్