- మనోళ్లు చెత్త మోసెటోళ్లు..సెక్యూరిటీ గార్డులు
- ఆఫీసర్ల జాబ్స్అన్నీ వాళ్లకే..
- 64 వేల ఉద్యోగాలన్నరు వెయ్యి కూడా ఇయ్యలే
- పూర్తి స్థాయిలో స్టార్టయ్యింది ఒక్కటే కంపెనీ
- రైతుల నుంచి 1357 ఎకరాలు గుంజుకున్న కేసీఆర్ సర్కారు
- డబుల్ ఇండ్లు కట్టిస్తమన్న మాటా నెరవేర్చలే
వరంగల్, వెలుగు: వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చి రోడ్డున పడ్డ రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. రైతుల దగ్గర బలవంతంగా భూములు గుంజుకుని ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి లారీల్లోంచి చెత్త బస్తాలను కిందకు దించడం, వాటిని ట్రాలీలు, పెద్ద డబ్బాల్లో మోసుకెళ్లడం, బాటిళ్లు, కవర్లు, ప్లాస్టిక్ మూతలను వేరు చేయడం లాంటి పనులు ఇప్పించి చేతులు దులుపుకుంది. ఇందులోనూ ఎక్కువగా బిహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు చెందిన వారే ఎక్కువ. సూపర్ వైజర్, మేనేజర్, యూనిట్ ఇన్చార్జి వంటి పెద్ద పోస్టుల్లోనూ నాన్ లోకల్స్‌ను నియమించి నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టింది.
అంతన్నారు..ఇంతన్నారు
వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో చింతలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో హడావుడి చేసింది. చుట్టుపక్కల ఊర్ల రైతుల నుంచి 2016 నుంచి దశలవారీగా 1357 ఎకరాలు సేకరించింది. 2017 అక్టోబర్ 22న అప్పటి సీఎం కేసీఆర్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని చెప్పారు. ఏడాదిలోపు అన్నీ పూర్తవుతాయని..భూములిచ్చిన రైతులకు ఇంటికో జాబ్‍తో పాటు పార్క్ఏరియాలో ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున లేఔట్ చేసి డబుల్ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. చదువురాని మహిళలకు బట్టల తయారీలో శిక్షణ అందించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ హామీలన్నీ ఏడాదిలోనే నెరవేరుస్తామన్నారు. కంపెనీల శంకుస్థాపనలకు అప్పటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరై పార్క్ భూములను టాప్ కంపెనీలకు ఇస్తున్నామని, వీటిద్వారా 33 -–34 వేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని చెప్పారు.
యంగ్ వన్ కంపెనీ ద్వారా 21 వేల మందికి, కైటెక్స్ కంపెననీతో 12 వేలు, గణేశా ఎకో కంపెనీ ద్వారా 1000 జాబ్స్వస్తాయని చెప్పారు. పార్క్‌లో ఇంకో 300 నుంచి 400 ఎకరాల భూములున్నాయని, వాటిని మంచి టెక్స్టైల్స్ కంపెనీలకే ఇస్తామన్నారు. తీరా చూస్తే ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేసే గణేశా ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక్కటే రెండేండ్ల కింద ఇక్కడ పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించింది. 21 వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందన్న యంగ్ వన్ కంపెనీ ట్రైనింగ్ఇవ్వడం తప్పించి చేసిందేమీ లేదు. 12 వేల మందికి ఉద్యోగాలు అందించే చిన్నపిల్లల బట్టల తయారీ సంస్థ కైటెక్స్ ఇంకా పనులే మొదలుపెట్టలేదు.
కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా రైతులు
ఫామ్ టూ ఫ్యాషన్ కాన్సెప్ట్‌తో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చే కంపెనీల ద్వారా ఓరుగల్లుతో పాటు చుట్టుపక్క జిల్లాల్లో పత్తి ధరలకు మంచి డిమాండ్ వస్తుందని కేటీఆర్ తెలిపారు. ‘మేడ్ ఇన్తెలంగాణ.. మేడ్ఇన్వరంగల్’ పేరుతో ఇక్కడి పార్కులో తయారయ్యే బట్ట అమెరికా, యూరప్, కొరియాలోని ప్రపంచంలోని పెద్ద మార్కెట్లకు వెళ్తుందని చెప్పారు. చూస్తే ప్లాస్టిక్ చెత్త నుంచి దారం తీసే కంపెనీ మాత్రమే పని చేస్తోంది. ఇందులోనూ 95 శాతం పనులను ఇటలీ, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి తీసుకొచ్చిన యంత్రాలే చేస్తున్నాయి. మిగతా ఐదు శాతం మ్యాన్ పవర్ మాత్రమే అవసరముండగా ఇందులో చెత్త మోయడం, సెక్యూరిటీ గార్డ్ జాబ్లే ఉన్నాయి. అవి కూడా థర్డ్ పార్టీ సంస్థల పేరుతో ఇచ్చిన కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే. ఇందులోనూ 70–80 శాతం మంది బిహార్, ఒడిసా, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. ఇక పెద్దస్థాయి పోస్టుల్లో స్థానికులకు కనీస అవకాశం ఇవ్వకుండా నాన్లోకల్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మా భూములను గుంజుకుని ఆగం చేసిన్రు
టెక్స్‌టైల్స్‌పార్కు పేరు చెప్పి అప్పట్లో ఎకరం రూ.50 లక్షలుండే మా భూములను రూ.10 లక్షలకు తీసుకున్నరు. కొద్దిపాటి భూములే ఉన్నాయని, తమ పొట్ట కొట్టవద్దని చెప్పినా వినలే. నోటీసులు, పోలీసులు, లీడర్లను పంపి గుంజుకున్నరు. కానీ, కేసీఆర్ చెప్పినట్లు ఉద్యోగాలు, డబుల్ బెడ్‍రూం ఇండ్లు ఇయ్యలే. బీఆర్‍ఎస్ లీడర్లు మాత్రం వారి భూములను ఇవ్వకుండా దాచుకున్నరు.
రైతులు సముద్రాల సాంబయ్య, కవిత
గబ్బు వాసనలో..లేబర్ పని చేస్తున్నా
పెద్దపెద్ద కంపెనీలు వస్తయ్. చదువుకున్నోళ్లకు పెద్ద కొలువులు, రైతులకు, మహిళలకు పార్కులోనే మంచి ఉద్యోగాలు ఇస్తామంటే భూములిచ్చినం. తీరాచూస్తే గణేశా కంపెనీలో చెత్త మోస్కపోయే పని ఇచ్చిన్రు. ఎక్కడెక్కడో గలీజ్ ప్లాస్టిక్ అంత ఇక్కడే గుట్టల్లా పారబోస్తున్రు. గబ్బు వాసనలో వాటిని ఎత్తుకెళ్లాలి. 8 గంటలు పనిచేస్తే రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నరు. ఈ పని ఎక్కువ రోజులు చేస్తే ఆరోగ్యం దెబ్బతినుడు ఖాయం.
కంపెనీలో పని చేసే ఓ స్థానికడు