
- లారీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే
- ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు
కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై మెదక్ జిల్లాల్లో రైతులు ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని, తూకం స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కౌడిపల్లి, రామాయంపేట, శివ్వంపేటలో రైతులు బుధవారం రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంత ఊరు కౌడిపల్లిలోనూ రైతులు ఆందోళకు దిగారు. మెదక్ - హైదరాబాద్ నేషనల్ హైవే మీద ట్రాక్టర్, ముళ్ల కంప అడ్డంగా పెట్టి దాదాపు మూడు గంటలు ఆందోళన చేశారు. వడ్లు రోడ్డుపై కుమ్మరించి, నిప్పంటించి నిరసన తెలిపారు.
వారం రోజులుగా లారీలు రాకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయని, దీనికి తోడు 43 కిలోలు కాంటా పెడుతూ సంచికి రెండు కిలోలు తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారంటూ రైతులు ఆవేదన చెందారు. లారీలు రాకపోవడంతో సొంత డబ్బులతో లారీలు తెచ్చుకొని సంచికి రూ. 15 ఇస్తూ రైస్ మిల్లుకు తీసుకెళ్తే, రైస్ మిల్లు యాజమాన్యం ధాన్యం బస్తాలు ఖాళీ చేసుకోకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. మూడు గంటల పాటు ధర్నా చేసినప్పటికీ ఒక్క అధికారి కూడా రాలేదు.
రైతుల ఆందోళనలో బీజేపీ జిల్లా నాయకుడు కాజీపేట రాజేందర్, కౌడిపల్లి మండల అధ్యక్షుడు రాకేశ్, ఎస్సీ మోర్చ నాయకులు మహిపాల్ పాల్గొని మద్దతు తెలిపారు. సొంత ఊర్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం దారుణమన్నారు. చివరకు కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి రైతులకు తహసీల్దార్‌తో మాట్లాడి లారీలు తెప్పించే ఏర్పాటుఉ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
డి.ధర్మారంలో..
రామాయంపేట మండలం డి.ధర్మారంలో రైతులు రాస్తారోకో చేశారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు లారీల కొరత వల్ల గత నాలుగు రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే ఆగి పోయాయని, దీంతో అక్కడ తూకం వేయడం నిలిపేశారు. ఆగ్రహించిన రైతులు రామాయంపేట - గజ్వేల్ రహదారి పైకి చేరుకుని సుమారు రాస్తారోకో చేశారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించి వెంటనే తూకం స్టార్ట్ చేయాలని వారు డిమాండ్. సుమారు గంట పాటు రాస్తారోకో జరగడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచి పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరవింప చేశారు.
శభాశ్ పల్లిలో...
తూకం వేసి పదిహేను రోజులైనా ధాన్యం తరలించడం లేదంటూ శివ్వంపేట మండలం శభాశ్పల్లి లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో చేశారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఆర్ఐ కిషన్ రైతులకు నచ్చజెప్పి ఒక లారీని రైతులకు అప్పగించారు. ఈ మేరకు అందులో వడ్ల బస్తాలు నింపగా లారీ యజమాని వచ్చి వడ్లకు లారీ పెడితే నెలరోజుల వరకు ఖాళీ కావడం లేదని, ప్రభుత్వం లారీలను లీజుకు తీసుకోవాలికానీ, ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ లారీలో ఉన్న వడ్ల బస్తాలను నింపిన దగ్గరనే ఖాళీ చేసి లారీ తీసుకెళ్లారు.