మా భూములకు రైతు బంధు, బీమా వర్తింపజేయాలి..రంగారెడ్డి కలెక్టరేట్ ​ముందు రైతుల ధర్నా

మా భూములకు రైతు బంధు, బీమా వర్తింపజేయాలి..రంగారెడ్డి కలెక్టరేట్ ​ముందు రైతుల ధర్నా

ఇబ్రహీంపట్నం, వెలుగు : బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఫార్మా సిటీకి తమ భూములివ్వబోమని కోర్టుకెళ్లిన రైతులు శనివారం కొంగరకలాన్​లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​గేట్​ముందు ఆందోళనకు దిగారు. తమ భూములకు రైతుబంధు, బీమా పథకాలు వర్తింపజేయాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు ఉన్న అభ్యంతరాలు చెప్పాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్​నారాయణరెడ్డి రైతులకు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 8న కలెక్టరేట్​కు రావాలని సూచించారు. అయితే నోటీసులు అందుకున్న యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన వందల మంది రైతులు శనివారం కొంగరకలాన్​లోని కలెక్టరేట్​కు వచ్చారు. 

వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఫార్మా సిటీకి తమ వ్యవసాయ భూములు ఇవ్వబోమని కోర్టులను ఆశ్రయించామని, దాదాపు 600 మంది రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. రైతుల అనుమతి లేకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్నారు. భూములను ఆన్​లైన్​నుంచి తొలగించారని వాపోయారు. 

కోర్టుల ఆదేశాలను అమలుపర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తమను విచారణకు పిలిచి కలెక్టరేట్​లోనికి వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కలగజేసుకొని కలెక్టర్​అందుబాటులో లేరని మరోసారి రావాలని సూచించారు. దీంతో కలెక్టరేట్ ఏఓ సునీల్​కు వినతిపత్రం అందజేసి రైతుల వెళ్లిపోయారు. రైతులు, ఫార్మా సిటీ  వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.