రుణమాఫీ చేయడం లేదని బ్యాంకు ఎదుట రైతుల ధర్నా

  • గత వారం కూడా ఆందోళన
  • కలెక్టర్​ హామీతో విరమణ
  • మాట నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ రాస్తారోకో
  • రైతులతో మాట్లాడిన అగ్రికల్చర్​ జేడీ

నల్గొండ అర్బన్, వెలుగు: రుణమాఫీ కావడం లేదని రెండు నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా బ్యాంక్ అధికారులు స్పందించడం లేదంటూ నల్గొండ పట్టణంలోని ఆర్పీ రోడ్డులోని కెనరా బ్యాంకు ఎదుట గురువారం రైతులు మెరుపు ధర్నాకు దిగారు. రుణమాఫీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు చేయడం లేదని కనగల్, నల్లగొండ మండలాలకు చెందిన 130 మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు.

కొటేషన్​ వచ్చి నెల గడుస్తోందని, అయినా రేపు మాపు అని తిప్పుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని చెబుతున్నారని, కనీసం బ్యాంకు లోపలికి కూడా రానివ్వడం లేదన్నారు. గత నెల 25న కూడా ధర్నా చేయగా కలెక్టర్ పిలిపించి మాట్లాడారని, వారంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించామని, మాట నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. సుమారు గంటకు పైగా ధర్నా చేయడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్రికల్చర్ జేడీ వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంక్ మేనేజర్ ను రుణమాఫీ చేయాలని ఆదేశించారు. రైతులు జగాల్ రెడ్డి, అంజయ్య, రుద్రాక్షి రవి, ముత్తయ్య, యాదయ్య, లింగయ్య, నగేశ్ పాల్గొన్నారు.