కోటగిరి, వెలుగు: గోదాముల్లో ఉంచిన తమ వడ్లు తమకు ఇవ్వాలని కోటగిరి ఏఎంసీ ఆఫీస్ ముందు రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. సీఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేశారన్న ఫిర్యాదుల మేరకు కోటగిరి ఏఎంసీ గోదామును కొన్ని రోజుల కిందట అధికారులు సీజ్ చేశారు. ఏఎంసీ సెక్రటరీ విధుల్లోకి రాకపోవడం, ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతులు కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు.
అక్రమ ధాన్యం నిల్వఉంటే వెంటనే విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పంట వేసే సమయం కావడంతో పెట్టుబడికి డబ్బులు అవసరమని, మార్కెట్లో ప్రస్తుతం ధాన్యానికి మంచి ధర ఉందన్నారు. తమ వడ్లు ఇస్తే అమ్ముకుని సొమ్ము చేసుకుంటామని చెప్పారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే నిరవధిక దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కోటగిరి జడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ ఏఎంసీ చైర్మన్ నీరెడి గంగాధర్, రైతులు మనోహర్, హనుమంతరావు, శ్రీధర్, సాదక్, జగన్ పాల్గొన్నారు.