ఎన్​డీసీసీ బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా

ఎన్​డీసీసీ బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా
  •     మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సురేందర్​
  •     పొలం వేలం వేస్తామంటూ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఆగ్రహం

లింగంపేట, వెలుగు:  నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ ​సెంట్రల్​ బ్యాంక్​(ఎన్​డీసీసీబీ) అధికారుల తీరుకు నిరసనగా​ శుక్రవారం మండలంలోని పోల్కంపేట గ్రామానికి చెందిన రైతులు లింగంపేటలోని ఎన్​డీసీసీ బ్యాంక్​ఎదుట ధర్నా చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

మండలంలోని పోల్కంపేట  గ్రామా నికి చెందిన రాజశేఖర్​రెడ్డి అనే రైతు బ్యాంక్​లో రుణం తీసుకుని సకాలంలో డబ్బు చెల్లించక పోవడంతో బ్యాంక్​ అధికారులు వ్యవసాయ భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎర్రజెండాలు పాతారు.  దీంతో ఆగ్రహించిన పోల్కంపేట గ్రామ రైతులు, మండల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ నాయకులు బ్యాంక్​ వద్దకు చేరుకుని ధర్నా చేశారు. బ్యాంక్​ అధికారుల తీరును తీవ్రంగా నిరసించారు. 

రైతులు అప్పు ఉంటే భూములను వేలం వేస్తారా?

మాజీ ఎమ్మెల్యే సురేందర్​ మాట్లాడుతూ... రైతులకు అప్పు ఉన్నంత మాత్రాన భూములను వేలం వేస్తామంటూ ప్లెక్సీలు పెడతారా? రేపటి లోగా ఫ్లెక్సీలను  తొలగించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. సహకార సంఘాల్లో రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలనీ ఆయన డిమాండ్​ చేశారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులపై వేధింపులు మొదలయ్యాయని, రైతులకు రుణమాఫీ చేయడంలో  సీఎం రేవంత్​రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.  

లింగంపేట ఎన్​డీసీసీ బ్యాంక్​లో 700  మంది రైతులు రుణాలు తీసుకుని వాయిదాల ప్రకారం చెల్లిస్తు న్నారని, కొందరు రైతులు అప్పు చెల్లించలేక పోతే బ్యాంక్​ అధికారులు వేధింపులకు గురిచేయడం సరికాదని అన్నారు. ​అప్పు చెల్లించకపోతే వ్యవసాయ పొలంలో ఎర్రజెండాలు ఏర్పాటు చేస్తారా? రైతులు ఏమైనా దొంగలా? స్మగ్లర్లా? అంటూ బ్యాంక్​ మేనేజర్ కుమార స్వామి​పై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా ఫ్లెక్సీలను, జెండాలను తొలగించకపోతే  ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. రైతు పొలం వేలం వేయాలనీ ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు జారీ చేసిందా? జీఓ కాఫీ ఉంటే చూపించాలని డిమాండ్​ చేశారు.

జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో ఫ్లెక్సినీ ఏర్పాటు చేశామని మేనేజర్​ వివరించారు.  రుణాలు తీసుకున్న రైతులు బ్యాంక్​ ఆఫీసర్ల వేధింపులకు భయపడొద్దని బీఆర్​ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ధర్నాలో బాధిత రైతు రాజశేఖర్​రెడ్డి, సంజీవరెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ లీడర్లు దివిటి రమేశ్​, ముదాం సాయిలు, గన్నూ నాయక్​, రమేశ్​, మనోహర్​, బండి నర్సింలు, మహిపాల్​రెడ్డి, మేకల రాములు, ప్రతాప్​రెడ్డి, సాయిరాం, పీర్యానాయక్​ పాల్గొన్నారు.