
కోదాడ, వెలుగు: వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ స్లాట్ బుక్ చేసినా తహసీల్దార్ కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన రైతులు గురువారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. మండలంలోని శాంతినగర్, త్రిపురవరం, అనంతగిరికి చెందిన పలువురు రైతులు భూమి రిజిస్ట్రేషన్ కోసం నాలుగు రోజుల కింద ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్నారు.
అనంతరం తహసీల్దార్ ఆఫీస్ వద్దకు వెళ్లగా నోటరీ తీసుకురావాలని, ఆర్‌ఐ రిపోర్ట్ కావాలంటూ చెప్పడంతో ఆ స్లాట్ క్యాన్సిల్ అయింది. తర్వాత మూడు రోజులుగా తిరుగుతున్నా రిజిస్ట్రేషన్ జరుగకపోవడంతో గురువారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల్లో రిజిస్ట్రేషన్ చేయాలని రూల్స్ ఉన్నా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని, ఒక్కో స్లాట్‌కు రూ.10 వేలు లంచం అడుగుతున్నారని రైతులు ఆరోపించారు.
ఈ విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల ధర్నాకు సీపీఐ కార్యదర్శి బద్దం కృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. రైతులు సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో ఆఫీసర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
చివరకు స్పందించిన తహసీల్దార్ అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ విషయంపై తహసీల్దార్ మాట్లాడుతూ తనపై రైతులు చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. అనుమానం ఉన్నప్పుడు సరైన పేపర్స్ తీసుకురావాలని చెబుతున్నామన్నారు.