జగిత్యాల జిల్లాలో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. మల్లాపూర్ మండలం కొత్తదామరాజ్ పల్లిలో నారాయణ రెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో గ్రామంలోని స్వాగత తోరణంపైకి ఎక్కి ధర్నా చేశాడు. ధాన్యం కొనుగోలు చేసి 25 రోజులు గడుస్తున్నా... తన ఖాతాల్లో డబ్బులు పడలేదని అవేదన వ్యక్తం చేశాడు. వడ్ల పైసలు తమ ఖాతాలో పడితేనే తోరణం నుంచి కిందికి దిగుతానని నారాయణ రెడ్డి కమాన్ పై కూర్చుండిపోయాడు.
మరోవైపు నారాయణ రెడ్డికి సంఘీభావంగా రైతులు సైతం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేవరకు కదిలేదే లేదని కొత్తదామరాజ్ పల్లి రోడ్డుపై బైఠాయించారు. వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా.. పైసలు సమయానికి రాకపోవడంతో చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. వారం రోజుల్లో పైసలు అకౌంట్లో పడతాయని చెప్పిన అధికారులు.. దాదాపు నెల రోజులు గడుస్తున్నా నగదు చెల్లించలేదన్నారు.