- మూడు గంటలు రాస్తారోకో చేసిన రైతులు
- ఏడీఈ హామీతో ధర్నా విరమణ
కోరుట్ల రూరల్, వెలుగు: కరెంటు కోతలకు నిరసనగా కోరుట్ల మండలం ధర్మారం గ్రామ రైతులు మల్లాపూర్ రహదారిపై మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రస్తుతం రోజుకు ఆరు గంటలు కూడా టైమ్‌కు ఇవ్వకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. ప్రతీ రోజు కనీసం 12 గంటల కరెంటైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. రాష్ట్రంలో సక్రమంగా కరెంటు ఇవ్వని సీఎం కేసీఆర్ దేశం మొత్తం ఫ్రీ కరెంటు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఒక ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న మోటార్లను రైతులు వంతులవారీగా వాడుకుంటారని, సమయపాలు లేకుండా కరెంట్ఇస్దుండడంతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా రాత్రిపూట కరెంటు ఇవ్వడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మూడు గంటల పాటు సబ్ స్టేషన్ ముందు ధర్నా చేయడంతో మల్లాపూర్ మండల ఆపరేషన్స్ ఏడీఈ శ్రీనివాస్ రావు రైతులతో మాట్లాడారు. రోజూ 12 గంటలు రెండు దఫాలుగా కరెంట్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.