రైతు దగాపడ్తున్నడు.. మిర్చి మార్కెట్లలో వ్యాపారుల దందా

ఖమ్మం, వెలుగు: మార్కెట్లలో వ్యాపారుల మాయాజాలానికి మిర్చి రైతు దగాపడ్తున్నాడు. జెండా పాట పేరుతో అత్యధిక రేటును పేపర్లపై చూపుతున్న వ్యాపారులు, రైతులకు ఇచ్చే రేట్లలో సగం కోతపెడ్తున్నారు. క్వాలిటీ లేదని, రంగు మారిందనే సాకులు చూపుతూ ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తున్నారు. జెండా పాట చూసి  పంటను మార్కెట్​కు తీసుకువస్తున్న రైతులు, తీరా ఆ రేటు రాకపోవడంతో పంటను ఇంటికి తీసుకెళ్లలేక వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చి మునుగుతున్నారు.

వరుసగా రెండురోజుల వారాంతపు సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం, వరంగల్​ మిర్చి మార్కెట్లకు రైతులు పెద్దఎత్తున పంట దిగుబడులు తీసుకువచ్చారు. తేజా రకం మిర్చికి  జెండా పాట ఖమ్మంలో రూ.21వేలు, వరంగల్ ​ఏనుమాముల మార్కెట్​లో రూ.20,500 నిర్ణయించినా, రూ.13వేలు, రూ.14 వేలకు మించి దక్కలేదు. క్వింటాల్​కు ఏకంగా రూ.7వేల దాకా తగ్గించడంతో వరంగల్​లో రైతులు రోడ్డెక్కి నాలుగు గంటల పాటు ధర్నా చేశారు. 

చేతులతో క్వాలిటీ నిర్ణయిస్తున్నరు.. 

ఖమ్మం జిల్లాలో దాదాపు 92 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు.  యేటా నవంబర్​ నుంచి మిర్చి పంట మార్కెట్​కు రావడం మొదలవుతుంది.  ఈ సారి ప్రారంభంలో సరిగా వర్షాల్లేకపోవడం, తర్వాత , నల్లి తెగులు, ఆకు ముడత, గుబ్బ తెగులు, తామర వైరస్​, వేరుకుళ్లు తెగులు, ఇలా రకరకాల తెగుళ్ల వల్ల దిగుబడి దెబ్బతింది. కొణిజర్ల, వైరా, తల్లాడ, ఏన్కూరు మండలాల్లో కొందరు రైతులు పంటను తొలగించి మళ్లీ సాగు చేశారు.

ఈలోగా గత నెలలో తుపాను ఎఫెక్ట్ తో మళ్లీ ఇబ్బంది పడ్డారు.  ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిచోట పది క్వింటాళ్లు కూడా రాలేదు. ఈ సమయంలో మిర్చి పంటను మార్కెట్ కు తెచ్చిన రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారు. గతంలో రూ.36 లక్షలు ఖర్చు చేసి తీసుకువచ్చిన మిర్చి నాణ్యత నిర్ధారణ యంత్రాల్లో మూడింటిని స్టోర్​ రూముల్లోనే దాచేసి,  చేతులతోనే క్వాలిటీ నిర్ధారిస్తున్నారు. వీళ్లను కంట్రోల్​ చేయాల్సిన  మార్కెటింగ్ అధికారులు, మార్కెట్ పాలకవర్గం కూడా వ్యాపారులకు సపోర్ట్ గానే ఉంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

రూ.12, 13 వేలకు అడుగుతున్నరు


రెండెకరాల్లో మిర్చి సాగు చేశా. క్వింటా రూ.23 వేల దాన్క రేటు పడుతుందని చెప్తే పంటను తీసుకొని వచ్చిన. మార్కెట్ కు వచ్చిన తర్వాత రూ.12 వేలు, రూ.13 వేలకే అడుగుతున్నరు. క్వాలిటీ తక్కువగా ఉన్నదని అగ్గువ రేటు అంటున్నరు. 
- ఇస్లావత్ హరి, జూలూరుపాడు, భద్రాద్రి జిల్లా 

పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు

సొంత భూమికి తోడు ఎకరా కౌలుకు తీసుకుని మూడెకరాల్లో మిర్చి వేసిన. తెగుళ్లు, వైరస్​ల తోటి బాగా పురుగుమందులు కొట్టాల్సి వచ్చింది. పెట్టుబడులకే రూ.2 లక్షలు ఖర్చు చేసిన. దిగుబడి కూడా బాగా తగ్గింది. పండిన పంటకు కూడా మార్కెట్లో ధర రావడం లేదు. 
- చుక్యా, బుర్కచర్ల గ్రామం, సూర్యాపేట జిల్లా 

14 వేలే ఇస్తున్నరు..

 ఏనుమాముల మార్కెట్​కు నాణ్యత ఉన్న  తేజ రకం మిర్చి తెచ్చినా. అయినా రేటు లేదంటున్రు.  అధికారులు వ్యాపారులతో కలిసి మోసం చేస్తున్రు.   క్వింటాల్‍కు రూ.14,500 చొప్పున రేటు కట్టిస్తున్రు. కూలీలు, ఆటో ఖర్చులు కూడా ఎల్లకపోతే పండించుడెందుకు..
- శంకర్‍, బాపునగర్‍, చెన్నారావుపేట,నర్సంపేట