- సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతుల ధర్నాలు
తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మిల్లర్ల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయంటూ ఫైరయ్యారు. కొన్నిచోట్ల రోడ్లపై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా తోటపల్లి రైతులు సోమవారం కరీంనగర్- సిద్దిపేట హైవేపై ధాన్యం బస్తాలతో ధర్నాకు దిగారు. మెదక్- నర్సాపూర్ నేషనల్ హైవేపై రాస్తారోకో చేశారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ ఆందోళనలు చేశారు.
- ధాన్యానికి నిప్పుపెట్టి రైతుల నిరసన
- తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఫైర్
కోహెడ(బెజ్జంకి)/నర్సాపూaర్/నల్లెబెల్లి/కురవి, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. మిల్లర్ల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయంటూ ఫైర్ అయ్యారు. కొన్నిచోట్ల రోడ్లపై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి రైతులు సోమవారం కరీంనగర్– సిద్దిపేట హైవేపై ధాన్యం బస్తాలతో ధర్నాకు దిగారు. పంటను కాంటా వేసి మిల్లులకు పంపితే తాలు, తరుగు పేరుతో మిల్లర్లు కటింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఎస్ఐ ప్రవీణ్ రాజ్ మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో రైతులు ధర్నా విరమించారు. అదేవిధంగా, మెదక్ – నర్సాపూర్ నేషనల్ హైవే అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. పది రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ మండిపడ్డారు. పోలీసులు సర్దిచెప్పి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మల్లేశ్ గౌడ్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమణరావు రైతులకు మద్దతుగా నిలిచారు.
మహబూబాబాద్‌లో నిరసన
కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంపల్లి–ఖమ్మం ప్రధాన రహదారిపై ధాన్యం పోసి నిప్పటించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయొద్దంటూ రామతీర్థం, అర్వయ్యపల్లి, బిలానాయక్తండా, కన్నారావుపేట గ్రామాల రైతులు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం వద్ద జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న బస్తాలకు అగ్గిపెట్టి నిరసన తెలిపారు. నల్లబెల్లి సొసైటీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది బీఆర్ఎస్ రైతు సంఘం నేతలు మండిపడ్డారు.