రైతులకు వడ్ల పైసలు అందలె.. బ్యాంకులు లోన్లు ఇస్తలె..

రైతులకు వడ్ల పైసలు అందలె.. బ్యాంకులు లోన్లు ఇస్తలె..

రైతుకు లాగోడి కష్టాలు

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టార్గెట్ రూ.21,286.51 కోట్లు.. బ్యాంకులిచ్చింది 5,084 కోట్లే

చిన్న రైతులకు తిప్పలు.. రుణమాఫీ పూర్తికాక పరేషాన్‌‌‌‌.. ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్రు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగిలో పంట పెట్టుబడికి పైసలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వానాకాలంలో పంట నష్టపోయి.. కొద్దోగొప్పో వచ్చిన వడ్లు అమ్ముకున్న పైసలు రాక.. బ్యాంకులు అప్పులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడంతో రైతులు పరేషాన్​ అయితున్నరు. వేరే దారిలేక ప్రైవేటు వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. యాసంగి ప్రారంభమై నెలన్నర కావస్తున్నా బ్యాంకర్లలో స్పందన లేదు. ఈ సీజన్​లో రూ.21,286.51 కోట్ల రుణాలు ఇవ్వాలని స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకర్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ (ఎస్ఎల్​బీసీ) టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. నిజానికి అక్టోబరు నుంచే పంట రుణాలు ఇవ్వాలి. కానీ ఇప్పటిదాకా రుణాలు 25 శాతం కూడా మించలేదని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. 4.66 లక్షల మంది రైతులకు రూ.5,084.35 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే టార్గెట్‌‌‌‌‌‌‌‌లో 23.89 శాతం మాత్రమే అందాయి. మరోవైపు ఈయేడు వానాకాలం, యాసంగి కలిపి బ్యాంకులు ఇచ్చిన అప్పులు ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ ఇచ్చిన టార్గెట్‌‌‌‌‌‌‌‌లో 55 శాతం కూడా దాటలేదు. ఏటా పంట రుణాల కోసం భారీ టార్గెట్లు పెడుతున్నా బ్యాంకర్లు ఎప్పుడూ పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే పరిస్థితి. వానాకాలం, యాసంగి సీజన్​లో ఇప్పటిదాకా పంట రుణాలు, టర్మ్‌‌‌‌‌‌‌‌రుణాలు కలిపి 51.65 శాతం మాత్రమే ఇచ్చారు.

ఆసరా అయితదనుకుంటే..

రాష్ట్రంలో రెండు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారు. ఏ పంట వేసినా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతోంది. వరి ఎకరం సాగుకు రూ.24,291 పెట్టుబడి అవుతుందని అధికారిక అంచనాలు ఉన్నాయి. సన్నకారు రైతులకు కొంత ఆసరా ఉంటుందనుకున్న రైతుబంధు పెట్టుబడి సాయం ఇప్పటిదాకా అందలేదు. మరోవైపు సర్కారు ఇప్పటిదాకా రూ.6,151.14 కోట్ల విలువైన వడ్లు రైతుల దగ్గర కొన్నది. కానీ లక్షలాది మందికి వడ్ల పైసలు బ్యాంకు అకౌంట్లలో పడలేదు. దీంతో విత్తనాలు, ఎరువులు కొనడానికి పైసలు లేక అప్పుల కోసం బ్యాంకులను ఆశ్రయించినా ఫలితం లేదు. వానాకాలం వడ్లమ్మిన పైసలు కూడా ఇంకా బ్యాంకులో పడలేదు. దీంతో వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు.

అప్పు మాఫీ కాలే

రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దఫాగా రూ.25 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు చెప్పి.. రూ.1,210 కోట్లు విడుదల చేసింది. అయితే ఇప్పటిదాకా 6.50 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. పాత అప్పులు మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకు అధికారులు అంటున్నారు. గత ఏడాది పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి పాత బాకీలని జమ చేసుకుని, మళ్లీ వాటినే
రెన్యువల్ చేసి బ్యాంకులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో వడ్డీలను రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి.

For More News..

రెండు నెలలు దాటినా వరద నీళ్లల్లనే ఉండాల్నా?

సంగమేశ్వరం పనులపై ఎన్జీటీలో పిటిషన్

జోన్లు తేలకుండా కొలువులెట్ల