- అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
రేగొండ/కథలాపూర్, వెలుగు: అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో పాటు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముడతనపల్లి రాజయ్య(56) తనకున్న మూడెకరాల భూమిలో మిరప, వరి సాగు చేశాడు. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాలకు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆదివారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, తాను పురుగుల మందు తాగుతున్నట్లు చెప్పాడు. వెంటనే బావి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు రాజయ్యను హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ధాన్యం తడిసిందని రైతు ఆత్మహత్యాయత్నం
వర్షానికి ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో ఆవేదన చెందిన గోపిడి మధు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణ్‌రావు పేట గ్రామంలో జరిగింది. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోవడంతో మనస్తాపంతో రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన తోటి రైతులు వెంటనే అతని చేతిలోని మందు డబ్బాను లాక్కుకున్నారు. 8 రోజుల కింద కొనుగోలు సెంటర్‌లో వడ్లు కాంటా పెట్టానని, ఇప్పటికీ లారీలు రాకపోవడంతో వర్షానికి ధాన్యం తడిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు.