చొప్పదండి/రామడుగు/గంగాధర,వెలుగు: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం వస్తుండని సంతోషపడ్డామని... కానీ కేసీఆర్‌మాత్రం బాధలు వినకుండానే వెళ్లిపోయాడని రామడుగు మండలం తిరుమలాపూర్, లక్ష్మీపూర్, రాంచంద్రాపూర్, చిప్పకుర్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం పరిశీలన తర్వాత రైతులతో సమావేశమవుతారని, సీఎంతో బాధలు చెప్పుకుందామని సంబరపడ్డామని పేర్కొన్నారు. కానీ... కేసీఆర్ కనీసం పంట నష్టం కూడా పరిశీలించకుండా వెళ్లిపోయారని చెప్పారు. సీఎం పర్యటనలో పోలీసులు, లీడర్లు మాత్రమే ఉన్నారని... పంట నష్టపోయిన రైతులను మాత్రం సీఎం కలువనీయకుండా రైతులను అవమానించారన్నారు.
ప్రజాప్రతినిధులను అవమానించిన్రు
వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు మండలానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఎంపీపీ కలిగేటి కవిత, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ సర్పంచులు జుట్టు లక్ష్మి, చిలుముల రజిత ఆరోపించారు. దళితులం అయినందుకే ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మండల ప్రజాప్రతినిధినైనా తమను హెలీప్యాడ్, రైతువేదికలో నిర్వహించిన మీటింగ్వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. కనీసం ఆఫీసర్లు కూడా పిలవలేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారని మీటర్ బిల్లింగ్ కార్మికులు ఆరోపించారు.
ముందస్తు అరెస్టులు..
సీఎం కేసీఆర్ పర్యటనకు ముందు రామడుగు మండలంలోని బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు, చొప్పదండిలో బీజేపీ లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి మండల బీజేపీ అధ్యక్షుడు మావురం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం వస్తే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోరాట ఫలితంగానే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి పొలాలలను పరిశీలించడానికి బయలుదేరారన్నారు. రాళ్ల వానతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, రాజన్నల రాజు,శివ, తిరుమలాపూర్ ఎంపీటీసీ రవి, శ్రీకాంత్, రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ లీడర్లు తదితరులు ఉన్నారు. గంగాధర మండలంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తూం నారాయణ, ఎంపీటీసీ మడుపు లింగారెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు గుండేటి మల్లేశం, ప్రధాన కార్యదర్శులు పంజాల ప్రశాంత్, రేండ్ల శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు తాళ్ల రాజశేఖర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు తూం కరుణాకర్, మండల ఉపాధ్యక్షుడు ఆకుల మనోహర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.