కాళేశ్వరం బ్యాక్​వాటర్ బాధితులకు పరిహారం.. సీఎం, ఎమ్మెల్యే వివేక్​, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు పాలాభిషేకం

 కాళేశ్వరం బ్యాక్​వాటర్ బాధితులకు పరిహారం.. సీఎం, ఎమ్మెల్యే వివేక్​, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు పాలాభిషేకం

చెన్నూరు నియోజకవర్గం సుందరశాల రైతుల హర్షం
సీఎం, ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు పాలాభిషేకం

కోల్​బెల్ట్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ బ్యాక్​వాటర్ వల్ల నీట మునిగిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంపై  రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం ఇప్పించిన సీఎం రేవంత్​రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోలకు మంగళవారం రాత్రి చెన్నూరు మండలం సుందరశాల గ్రామ రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నాలుగేండ్లుగా పంటలు మునిగి తీవ్ర నష్టం జరిగినా గత బీఆర్ఎస్​ సర్కార్ ఆదుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించిందని రైతులు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ సర్కార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏనాడు పంటలు నీట మునిగిన రైతులను, ఆయా గ్రామాలను సందర్శించ లేదన్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా నట్టేట ముంచిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేసిందన్నారు. పొలాలు బ్యాక్​వాటర్​లో మునిగిన రైతులకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించిందన్నారు. పంట నష్టపోయిన పది రోజుల్లోనే పరిహారం ఇప్పించిన ఘనత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు దక్కుతుందన్నారు. తమ కష్టాలను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి అండగా నిలిచారని తెలిపారు. వివేక్​ వెంకటస్వామి, గడ్డం వంశీకృష్ణ రైతులకు అండగా నిలిచారంటూ.. కృతజ్ఞతలు తెలియజేశారు.