
- రైతులకు ఫోన్ చేసి విత్తన ప్యాకెట్లు హోమ్ డెలివరీ
- కర్నాటక, ఇతర జిల్లాలకు సప్లై
- జిల్లాల్లో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్న ఆఫీసర్లు
మహబూబ్నగర్, వెలుగు: అకాల వర్షాలకు వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు.. రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ కార్తె రావడానికి ఇంకా నెల టైం ఉండడంతో పత్తి సాగుకు చేయాలనుకుంటున్న రైతులు విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొందరు విత్తన వ్యాపారులు, పెస్టిసైడ్స్ షాపుల నిర్వాహకులు రైతులను మోసం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు కాకుండా.. లూజ్ విత్తనాలను అంటగడుతున్నారు.
వారం రోజుల్లో ఉమ్మడి పాలమూరులో జిల్లాలో 15 క్వింటాళ్ల లూజ్ విత్తనాలను ఆఫీసర్లు పట్టుకొని సీజ్ చేశారు. పత్తి విత్తనాల కొనుగోలు సీజన్ కావడంతో.. ఉమ్మడి జిల్లాలో అగ్రికల్చర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఏటా సీజన్లో ఆఫీసర్లు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫెయిల్ సీడ్స్ను మార్కెట్లోకి చలామణి చేస్తున్న అసలు సుత్రధారులను కాకుండా.. కొందరిపై కేసులు పెట్టి చేతులు దలుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఇంటికి వచ్చి ప్యాకెట్లు ఇస్తున్నారు..
నకిలీ విత్తనాలను కట్టడి చేయడానికి ఆఫీసర్లు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తుండడంతో వ్యాపారులు వీటిని రవాణా చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్లాన్ ప్రకారం ఈ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాత పరిచయాలను ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు రైతులకు ఫోన్లు చేస్తున్నారు. ‘విత్తనాలు వచ్చాయి. మీరు షాపుల వద్దకు రావాల్సిన అవసరం లేదు. మేమే మీ ఊరికి వస్తాం. వచ్చే ముందు మీకు ఫోన్ చేస్తాం. మీ ఇంటి అడ్రస్ చెప్పండి’ అని వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వ్యాపారులు వారి ఏజెంట్ల ద్వారా బైకుల మీద 10, 20 ప్యాకెట్ల చొప్పున నేరుగా రైతు ఇంటి వద్దకు పంపిస్తున్నారు.
ఎవరికీ అనుమానం రాకుండా రైతులకు ఫెయిల్ సీడ్స్ అంటగడుతున్నారు. తక్కువ ధరకు విత్తనాలు వస్తుండడం, మండలాలు, జిల్లా కేంద్రాల్లోని షాపుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం.. వ్యాపారులు ఇండ్ల వద్దకు వచ్చి విత్తన ప్యాకెట్లు ఇచ్చి వెళ్తుండడంతో ఆ ప్యాకెట్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ, అవి ఫెయిల్ అయిన విత్తనాలు అని తెలియక.. తీరా విత్తనాలు విత్తుకున్నాక తెలుసుకొని నష్టపోతున్నారు.
నష్టపోతున్న రైతులు..
ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ ప్రాంతాల్లో రైతులు వరి తర్వాత పత్తి సాగుకు మొగ్గు చూపుతారు. ఇందులో గద్వాలలో సీడ్ పత్తికి డిమాండ్ ఉండగా.. వనపర్తిలో మాత్రం అత్యల్పంగా పత్తి సాగు చేస్తారు. అయితే జర్మినేషన్ టెస్టులో ఫెయిల్ అయిన విత్తనాలను కొందరు వ్యాపారులు రైతుల నుంచి సేకరిస్తున్నారు. ఆ విత్తనాలకు వివిధ కంపెనీ లేబుళ్లతో ప్యాక్, సీల్ వేసి రైతులకు అమ్ముతున్నారు. ఈ విత్తనాలతో పంట ఏపుగా పెరిగినా.. దిగుబడులు రావడం లేదు. నిరుడు నర్వ, మరికల్, మిడ్జిల్, చిన్నచింతకుంట, దేవరకద్ర, మాగనూరు, మక్తల్ మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. పత్తి మొక్కలు ఎదిగినా.. పూత, కాత రాలేదు. కొన్ని చోట్ల మొక్కలకు కాయలు పట్టినా.. ఐదారుకు మించి లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
15 క్వింటాళ్ల లూజ్ విత్తనాలు పట్టివేత..
నాలుగు రోజుల్లో ఆఫీసర్లు ఉమ్మడి జిల్లాలో 15 క్వింటాళ్ల లూజ్ విత్తనాలను పట్టుకొని సీజ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావులచెర్వు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో సబ్ ఆర్గనైజర్ కు చెందిన 12.75 క్వింటాళ్ల సీడ్ విత్తనాలు పట్టుకొని సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామ శివారులో గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కుర్వ బస్వారాజు పొలంలోని షెడ్లో ఐదు సంచుల లూజ్ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.
రైతుల వద్దకే వెళ్తున్నారు..
కొందరు రైతులు పత్తి విత్తనాలను షాపుల వద్ద కొనడం లేదు. షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. షాపుల్లో కేవలం ప్రభుత్వ సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే ఉన్నాయి. నకిలీ విత్తనాలు అమ్మేవారు నేరుగా గ్రామాల్లోని రైతుల ఇండ్లకు రాత్రిళ్లు వెళ్లి విత్తన ప్యాకెట్లు ఇస్తున్నారు. ఆ సమాచారం దొరకడం లేదు. ఇలాంటి విత్తనాలతో పంట ఎదగక రైతులు నష్టపోయే అవకాశం ఉంది. లాస్ అయిన తర్వాత మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు.
వెంకటేశ్, డీఏవో, మహబూబ్నగర్