
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
- భారీ మొత్తంలో నష్టపోయిన రైతులు
- గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు, మూగజీవాలు మృతి
వెలుగు నెట్‌వర్క్ : పంట చేతికొచ్చే టైంలో పడుతున్న అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలుల కారణంగా వరి పంట నేలకొరగగా, మామిడికాయలు రాలిపోయాయి. మరోవైపు భారీ వర్షం పడడంతో కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. రాశుల మధ్యకు భారీ స్థాయిలో నీరు చేరడంతో వడ్లు కొట్టుకుపోయాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఆరుగాలం పడిన కష్టమంతా నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు
- యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, బీబీనగర్, భువనగిరి, బొమ్మల రామారం మండలాల్లో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడిసిపోయాయి. సెంటర్లలోకి భారీ ఎత్తు నీరు చేరడంతో వడ్లు కొట్టుకుపోయాయి. వడ్లను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాన కారణంగా వడ్లు తడిసిపోవడంతో తేమ శాతం పెరిగిందని, దీంతో కొనుగోళ్లలో మరింత ఆలస్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మధ్యాహ్నం 43 డిగ్రీల ఎండ నమోదు కాగా.. సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాత్రి 7 గంటల నుంచి బలమైనగాలులకు తోడు సుమారు గంట పాటు వర్షం దంచి కొట్టింది. నిజామాబాద్ నగరంతో పాటు రూరల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్ మండలాల్లో వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు తడిసిపోయాయి.
- నారాయణపేట జిల్లా ఉమ్మడి మాగనూరు మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. మాగనూరు గ్రామ శివారులో హైవేపై చెట్లు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణ మండలానికి సరఫరా అయ్యే 33 కేవీ విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి.
- జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్, గట్టు, కేటీదొడ్డి, గద్వాల మండలం, పట్టణంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షంతో కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఐజ – గద్వాల రహదారితో పాటు పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేటీదొడ్డి మండలంలో మామిడి కాయలు రాలిపోయాయి.
- అసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో శనివారం రాత్రి కురిసిన గాలివాన పంటలకు తీవ్రం నష్టం కలిగించింది. ఈదురుగాలుల కారణంగా కోతకు వచ్చిన వరి పైరు నేల కొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. వానతో కల్లాల్లోని వడ్లు తడిసిపోయాయి. వడ్లను కాపాడుకునేందుకు రైతులు కవర్లు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది.
పిడుగుపడి ఇద్దరు మృతి
మక్తల్/గద్వాల, వెలుగు : నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఆదివారం పిడుగులు పడడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, పలు మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. మక్తల్ మండలం ఉప్పర్‌పల్లికి చెందిన అంజనేయులు (35) ఆదివారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. ఈ టైంలో గాలి, వాన వస్తుండడంతో వడ్లను కుప్పగా పోస్తున్నాడు. ఈ టైంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అలాగే దాదన్‌పల్లికి చెందిన కుర్వ కురుమూర్తి (16) తమ గొర్రెలను మేపేందుకు కృష్ణా నది సమీపంలోకి వెళ్లాడు. ఈ టైంలో ఉరుములతో కూడిన వర్షం పడడంతో ఓ చెట్టు కింద నిల్చున్నాడు. పక్కనే పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
అలాగే గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వేమారెడ్డి చెందిన రెండు గేదెలు, వెంకటాపురం గ్రామంలోని ఓ రైతుకు చెందిన మూడు గేదెలు పిడుగుపాటుతో చనిపోయాయి. చింతలకుంటకు చెందిన బోయ కృష్ణ ఆవు, భీంపురంలో ఆంజనేయులుకు చెందిన ఓ ఆవు, మల్దకల్ మండల కేంద్రానికి చెందిన తిమ్మన్నకు సంబంధించిన ఎద్దు, ధరూర్ మండలం గార్లపాడులోని నర్సింలుకు చెందిన రెండు కాడెడ్లు, ఉమ్మిత్యాల గ్రామానికి చెందిన కర్రెన్న ఎద్దు చనిపోయాయి. బిజ్వారం నుంచి బురెడ్డిపల్లె వస్తున్న దారిలో ఆలూరుబుడ్డలకు చెందిన 15 పొట్టేళ్లు పిడుగుపాటుతో చనిపోయాయి.