- డేటా ప్రిపరేషన్లోనే పొరపాట్లు
- ఆధార్ మిస్ మ్యాచ్‌తో
- అర్హులైన రైతుల పేర్లు గల్లంతు
- సాఫ్ట్వేర్ లోపాలతోనూ కొందరు అనర్హుల లిస్టులోకి వెళ్లినట్లు అనుమానాలు
- అసలు, వడ్డీ లెక్కింపులోనూ బ్యాంకర్ల నిర్లక్ష్యం
- ఒక్కో ఏఓ, ఏఈఓకు 300 నుంచి వెయ్యి వరకు దరఖాస్తులు
కరీంనగర్/ఆదిలాబాద్, వెలుగు : రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలు రూపొందించడంలో బ్యాంకర్లు, కో ఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్లు చేసిన తప్పులతో.. కొందరు రైతులకు తిప్పలు తప్పడం లేదు. రూ.2 లక్షల్లోపు క్రాప్ లోన్లు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆఫీసర్ల నిర్వాకంతో పలువురికి మాఫీ కాలేదు. అర్హులైన రైతులందరి డేటాను ఉన్నతాధికారులకు పంపకపోవడం, ఒకరి అకౌంట్ నంబర్‌కు వేరొకరి ఆధార్ నంబర్ లింక్ చేయడం, రైతుల పేర్లు, వయస్సు, ఇతర వివరాలు పాస్‌బుక్స్‌లో ఒకలా ఉంటే లోన్ అకౌంట్లలో మరోలా ఎంట్రీ చేయడం, అసలు, వడ్డీ లెక్కల్లో తప్పుల కారణంగా వేలాది మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు.
రుణమాఫీ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ లోపాలతోనూ మరికొందరికి మాఫీ కాలేదని తెలిసింది. ఇలాంటి తప్పులు ఎక్కువగా పీఏసీఎస్ లతోపాటు ఐవోబీ, యూనియన్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎక్కువగా దొర్లినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు.
ఇష్టారాజ్యంగా అసలు, వడ్డీ లెక్కలు..
బ్యాంకర్లు లోన్‌గా తీసుకున్న అసలు, వడ్డీని లెక్కించడంలో చేసిన తప్పుల కారణంగా కూడా కొందరికి రుణమాఫీ కాలేదు. రైతు తీసుకున్న లోన్ రూ.2 లక్షల్లోపే అయినప్పటికీ..బ్యాంకు ఆఫీసర్లు దానికి వడ్డీ కలిపి లెక్కించడంతో రూ.2 లక్షలు దాటుతోంది. అసలు, వడ్డీని కలిపి మొత్తం అప్పుగా చూపడంతో సదరు రైతు అర్హత కోల్పోవాల్సి వచ్చింది. రుణమాఫీ కోసం కొందరు రైతులు ముందుగానే వడ్డీతోపాటు కొంత అసలు చెల్లించినా.. డేటాను అప్ డేట్ చేయకపోవడంతో కూడా వారికి మాఫీ కాలేదు. పీఏసీఎస్ లు, కొన్ని బ్యాంకుల్లో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా జరిగాయి.
తప్పులతడకగా డేటా ఎంట్రీ..
కొన్ని బ్యాంకుల్లో భార్య ఆధార్ నంబర్ భర్త లోన్ అకౌంట్ కు, భర్త ఆధార్ నంబర్ భార్య అకౌంట్‌కు లింక్ చేశారు. కొన్ని చోట్ల వేరొకరి నంబర్, లేదంటే ఆధార్ నంబర్ తప్పుగా నమోదు చేశారు. అలాగే ఆధార్‌లో ఇంటి పేరు తర్వాత రైతు పేరు ఉంటే.. కొన్ని బ్యాంకుల్లో ముందు రైతు పేరు, తర్వాత ఇంటి పేరు నమోదు చేశారు. కొందరి వయస్సు, పుట్టిన తేదీని కూడా తప్పుగా ఎంట్రీ చేశారు. ఇలాంటి క్లరికల్ మిస్టేక్స్తోనూ చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు వారంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
సెక్రటరీల నిర్లక్ష్యంతో ..
రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బినామీ పేర్లతో లక్షలాది రూపాయల లోన్లు తీసుకోవడం,రుణమాఫీతో లబ్ధిపొందడం కొందరు సెక్రటరీలు, లీడర్లకు అలవాటుగా మారింది. ఏండ్ల తరబడి ఒకే చోట పని చేస్తుండడంతో వీళ్ల అక్రమాలకు అంతులేకుండాపోయింది. ఈ దఫా రుణమాఫీలోనూ సెక్రటరీల అవినీతి, అక్రమాల వ్యవహారం వెలుగు చూసింది. రాష్ట్రంలోని 157 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) సెక్రటరీల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదని సహకార శాఖ గుర్తించింది.
ఆయా సెక్రటరీలు రుణమాఫీకి అర్హులైన అనేక మంది రైతుల లిస్టును ఉద్దేశపూర్వకంగానే పంపకపోవడమేగాక.. తప్పుడు లెక్కలు వేసి కొందరు అనర్హులు, తమ బినామీల పేర్లు చేర్చారు. అంతేగాక అసలు, వడ్డీని తప్పుగా లెక్కించి సర్కార్ కు తప్పుడు డేటా పంపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా16 మంది సెక్రటరీలను సస్పెండ్ కాగా, మరో 141 మందిపై క్రమశిక్షణా చర్యలకు సహకార శాఖ ఉపక్రమించింది.
300 నుంచి వెయ్యి వరకు దరఖాస్తులు
రుణమాఫీ కాని రైతుల నుంచి అన్ని మండలాల్లో ఏఓలు, ఏఈఓలు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఒక్కో మండలంలో ఇప్పటి వరకు 300 నుంచి 500 వరకు అప్లికేషన్లు వచ్చాయి. పొరపాట్లను గుర్తించి, వాటిని సరి చేసి వారు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 8,129 అప్లికేషన్లు అందగా, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్ జిల్లాలో వెయ్యి అప్లికేషన్లు దాటాయి.
బ్యాంకు మేనేజర్ తప్పిదంతో ..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగుర్ లోని ఇండియన్ బ్యాంక్ లో 1400 వరకు రుణమాఫీకి అర్హులైన రైతుల క్రాప్ లోన్ అకౌంట్స్ ఉండగా.. ఇంతకుముందు వరకు ఇక్కడ పని చేసిన మేనేజర్ 311 మంది రైతుల పేర్లు మాత్రమే పంపారు. ఫలితంగా 1089 మందికి మాఫీ కాలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. ఇప్పుడు అర్హులైన వారి పేర్లు పంపుతామని ప్రస్తుత మేనేజర్ చెప్తున్నారు.
భర్త అకౌంట్‌కు భార్య ఆధార్ లింక్
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగాపల్లికి చెందిన రైతు అటికం చంద్రయ్య గతంలో కొనుకుల కొండాపూర్ ఎస్బీఐ శాఖలో రూ1,00,840 క్రాప్ లోన్ తీసుకున్నారు. 2023లో రెన్యూవల్ కూడా చేశారు.కానీ రుణమాఫీ కాకపోవడంతో ఆఫీసర్లను సంప్రదించగా ఆయన క్రాప్ లోన్ అకౌంట్ కు ఆయన భార్య భూలక్ష్మి ఆధార్ నంబర్ లింక్ అయిందని, అందుకే కాలేదని చెప్పారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వడ్డీ కలిపేయడంతో రుణమాఫీ కాలే..
నేను కురిక్యాల కేడీసీసీబీలో రూ.2 లక్షలు అప్పు తీసుకున్నా. ఫిబ్రవరిలో అసలు రూ.2 వేలతోపాటు వడ్డీ చెల్లించాను. దీంతో నా లోన్ మొత్తం రూ.1.98 లక్షలకు చేరింది. అయితే మార్చి నుంచి మొన్న మూడో విడత వరకు లెక్కించడంతో అసలు, వడ్డీ కలిపి రూ.2,00,300కు చేరింది. రూ.2 లక్షలు దాటిందని బ్యాంకు అధికారులు రుణమాఫీ కోసం ప్రభుత్వానికి పంపలేదు. దీంతో నాకు రుణమాఫీ కాలేదు.
- దొంతిసారపు నర్సమ్మ, గట్టుభూత్కూర్, గంగాధర మండలం
అధికారులు తప్పు లేదంటున్నారు
బ్యాంక్ ఆఫీసర్లు నా ఆధార్‌ను వేర్వేరు లోన్ ఐడీలతో లింక్ చేయడం వల్ల నాకు రుణమాఫీ కావడం లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే బ్యాంకులో అడగాలని చెబుతున్నారు. బ్యాంకుకు వెళ్తే తమకేం తెలియదంటూ అగ్రికల్చర్ ఆఫీసర్లపై నెట్టేస్తున్నారు. ఎన్నిసార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా రుణ మాఫీకి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచక రోజు బ్యాంకు, అగ్రికల్చర్ ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలి.
- గంగుల కృష్ణారెడ్డి, శాయంపేట, హనుమకొండ జిల్లా