హనుమకొండ(ధర్మసాగర్), వెలుగు: ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కోఆర్డినేషన్‌తో పని చేయాల్సిన రెండు శాఖలు అలసత్వం ప్రదర్శించడం, ఇనుపరాతి గుట్టల్లోని అటవీ ప్రాంతానికి హద్దులు నిర్ణయించకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడాల్సి వస్తోంది. తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములు రైతులకు చెందినవేనంటూ ఓ వైపు రెవెన్యూ ఆఫీసర్లు పట్టాలు ఇచ్చి రైతుబంధు సాయం అందిస్తుండగా.. అసలు ఆ భూములతో వారికి సంబంధమే లేదంటూ ఫారెస్ట్ అధికారులు చుట్టూ ట్రెంచ్ కొట్టేశారు. అదంతా అటవీశాఖకు చెందిన భూమేనంటూ హరితహారంలో భాగంగా మొక్కలు కూడా నాటి వెళ్లిపోయారు. దీంతో తమ వద్ద ఉన్న పట్టా పాసుబుక్కులు పట్టుకుని బాధిత రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మొక్కలను తొలగించి సాగు చేస్తే కేసులు పెడతామంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ సంగతి..
హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల పరిధిలో ఉన్న ఇనుపరాతిగుట్టలను ఆఫీసర్లు ఫారెస్ట్ ఏరియాగా గుర్తించారు. ఈ నాలుగు మండలాల పరిధిలో దాదాపు 4,887 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ గుట్టలను రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించాలన్న ప్రపోజల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఇనుపరాతి గుట్టలకు సమీపంలోనే ధర్మసాగర్ మండలం ముప్పారం శివారు 823, 824, 825, 842, 843, 844 సర్వే నెంబర్లతోపాటు మరికొన్ని బై నెంబర్లలో ఉన్న దాదాపు 120 ఎకరాల భూమి సాగవుతోంది. గతంలో ఆఫీసర్లు ఈ భూములకు పట్టా పాస్ బుక్కులు ఇష్యూ చేశారు. తెలంగాణ వచ్చాక కొత్త పాస్ బుక్ లు కూడా జారీ చేయడంతో ఆయా భూములకు సంబంధించి రైతులు రైతుబంధు సాయం కూడా పొందుతున్నారు. కాగా ఇనుపరాతి గుట్టలను రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించాలన్న ప్రతిపాదన వచ్చిన తరువాత అటవీ అధికారులు దాదాపు మూడేండ్ల కిందట ఆ భూములను పరిశీలించారు. అదంతా అటవీశాఖకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పి ట్రెంచ్ కొట్టడం స్టార్ట్ చేశారు. దీంతో తాతల కాలం నుంచి ఆ భూములు సాగు చేసుకుంటున్నామని అక్కడి రైతులు ఫారెస్ట్ ఆఫీసర్లకు విన్నవించారు. అదంతా ఏమీ పట్టించుకోకుండా అటవీ అధికారులు తమపని తాము చేసుకు పోయారు. అప్పటినుంచి ముప్పారం గ్రామ రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.
హద్దుల్లేక గందరగోళం
ఇనుపరాతిగుట్టలను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించే ప్రక్రియలో భాగంగా మూడేండ్ల కిందట ఫారెస్ట్ ఆఫీసర్లు డిజిటల్ సర్వే చేశారు. కానీ రెవెన్యూ, ఫారెస్ట్ రెండు డిపార్ట్మెంట్లు జాయింట్ సర్వే ద్వారా ఆయా భూములకు హద్దులు నిర్ణయించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సింది. కానీ రెండు శాఖల మధ్య కోఆర్డినేషన్ లేక ఈ ప్రక్రియకు అడుగు ముందుకు పడలేదు. ఓ వైపు హద్దులు సరిగా లేకపోవడం, ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ అటవీ భూముల్లో తరచూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ ఏరియా వరకు పక్కాగా సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తేనే అటవీ భూములు, రైతుల పట్టా భూముల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షిణలు
రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా ముప్పారం రైతులు సఫర్ కావాల్సి వస్తోంది. పట్టా భూములను ఫారెస్ట్ భూములంటూ ఆఫీసర్లు మొక్కలు నాటడం, మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసేదేమీ లేక తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూముల పట్టాపాస్ బుక్కులతో ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే విషయమై కలెక్టర్ ఆఫీస్‌లో వినతిపత్రం అందించినా పట్టించుకునే నాథులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమ సమస్యను పరిష్కరించేందుకు ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని అక్కడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సర్వే నెంబర్లు ఒక చోట ఉంటే, ముప్పారం రైతులు ఇంకోచోట ఫారెస్ట్ భూముల్లోకి ఎంటరై సాగు చేస్తున్నారని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఓ వైపు పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. అందుకు భిన్నంగా ఇక్కడ వివాదం తలెత్తుతుండటంతో ఆఫీసర్లు, లీడర్లు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి.
తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నం
మా తాతల కాలం నుంచి అవే భూములను సాగు చేసుకుంటున్నం. కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు మొత్తం సాఫ్ చేసి కందకాలు తవ్వారు. మాకు పట్టాపాసు బుక్కులు ఉన్నాయని చెప్పినా వినకుండా మొక్కలు నాటి వెళ్లిపోయారు. మొక్కలను తొలగిస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఫారెస్టోళ్లు బెదిరింపులకు గురి చేస్తున్నారు. పెద్దాఫీసర్లు పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయాలి. - పొన్నబోయిన నారాయణ, ముప్పారం
ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు
వారసత్వంగా మేం సాగు చేసుకుంటున్న పట్టా భూముల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్లు ఎంటరై దౌర్జన్యం చేస్తున్నారు. పట్టా భూములను కూడా ఫారెస్ట్ ల్యాండ్ కింద చూపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే విషయమై ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదు చేశాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. - ఏతిరాజుల మల్లయ్య, ముప్పారం