- మ్యుటేషన్ కాని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లు
- పోర్టల్ లో లోపాలే ఆసరాగా అక్రమాలు
- ప్లాంటింగ్ చేసిన భూములకు పాస్ బుక్కుల జారీతో వివాదాలు
- ధరణిలో తమ భూమి కనిపించక ఏడాదిలో నలుగురు రైతుల ఆత్మహత్య..ఒకరు గుండెపోటుతో మృతి
- భూసమస్యలపై లక్షల్లో దరఖాస్తులు పెండింగ్
హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ రాష్ట్ర రైతులను ఆందోళనలు, ఆత్మహత్యల వైపు పురికొల్పిన ధరణి పోర్టల్‌లోని లోపాలు.. ఇప్పుడు ఏకంగా హత్యలకు దారితీస్తున్నాయి. అన్ని భూవివాదాలకు పరిష్కారమని ప్రభుత్వ పెద్దలు చెప్పిన పోర్టలే కొత్త వివాదాలకు కారణమవుతున్నది. ధరణిలో తమ పేరు రాలేదని, భూమి ఎక్కలేదన్న ఆవేదనతో కలెక్టరేట్లు, తహసీల్దార్ ఆఫీసుల ముందు ఇప్పటికే అనేక మంది బాధిత రైతులు కిరోసిన్, పెట్రోల్ బాటిళ్లు, పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యకు యత్నించగా.. తమకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో ఏడాది కాలంలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు గుండెపోటుతో మరణించాడు. వెలుగులోకి రాని మరణాలు, సెటిల్మెంట్లు అనేకం ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యుటేషన్ చేసుకోకపోతే అలాంటి భూములకు పట్టాదారులుగా ధరణిలో పాత ఓనర్ల పేర్లు వచ్చాయి. ఇదే అదనుగా పాత ఓనర్లు గుట్టు చప్పుడు కాకుండా మరొకరికి భూములు అమ్మేయడం, లేదంటే తమ బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయడంలాంటి ఘటనలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో జరిగిన కాల్పుల ఘటనతో భూముల డబుల్ రిజిస్ట్రేషన్, భూ వివాదాల్లో కొందరు పాత నేరస్తుల తలదూరుస్తున్న వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ మహానగరంతోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలాంటి నగరాల చుట్టూ మూడు, 4 దశాబ్దాల కిందటి నుంచే నాన్ లేఔట్ వెంచర్లు విరివిగా వెలుస్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి జిల్లాల్లో ఇలాంటి ఫామ్ ల్యాండ్స్, వెంచర్లు వేలాదిగా ఉన్నాయి. కనీసం నాలా కన్వర్షన్ కూడా చేసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాటింగ్ చేసి ప్లాట్లుగా అమ్మేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేయించి డాక్యుమెంట్లు కొనుగోలుదారుల చేతుల్లో పెట్టారు. రిజిస్ట్రేషన్ అయిందనే భరోసాతోపాటు అవగాహనలోపంతో చాలా మంది ప్లాట్ల కొనుగోలుదారులు ఏండ్లు గడిచినా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయించుకోలేదు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా మ్యుటేషన్ చేయించుకోలేదు. అమ్ముకున్న ఓనర్లు కూడా ఎలాగూ అమ్మేశామని తమ భూముల సంగతి వదిలేశారు. అయితే భూరికార్డుల ప్రక్షాళన నాటికి మ్యుటేషన్ పెండింగ్ లో ఉండడం, వీఆర్వోలు, ఎమ్మార్వోలు భూములను ఫిజికల్ గా చూడకుండా పాత రికార్డుల వెరిఫికేషన్ మాత్రమే చేయడం, కార్డు రిజిస్ట్రేషన్లను పట్టించుకోకపోవడంతో పాత ఓనర్ల పేర్లే రికార్డుల్లోకి ఎక్కాయి. వారికే పాస్ బుక్స్ కూడా జారీ అయ్యాయి. ఇదే అదనుగా కొందరు పాత ఓనర్లు ఇవే భూములను ఇతరులకు అమ్మేస్తున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తమ ప్లాట్ల కోసం ఓనర్లు వెళ్తే ధరణి ద్వారా కొన్న వ్యక్తులు వారిని తరిమేస్తున్నారు. ప్లాట్లను చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చేస్తున్నారు. ధరణిలో ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక దానిని క్యాన్సిల్ చేయడం తహసీల్దార్, కలెక్టర్ చేతుల్లో లేకపోవడంతో బాధితులు చేసేది లేక కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భూవివాదాలకు సంబంధించి హైకోర్టులో రోజుకు 300 వరకు కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్లాట్లు కొన్నోళ్లకు తిప్పలు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరుగొములలోని సర్వేనంబర్ 154, 155, 157లో 16 ఎకరాల భూమిని సయ్యద్ విలాయత్ హుస్సేన్, విరాసత్ హుస్సేన్ కొనుగోలు చేసి 1989లో ఖాజా పాషా అనే వ్యక్తికి జీపీఏ చేశారు. ఆయన స్థానిక గ్రామ పంచాయతీ అనుమతితో సాయిబాబా నగర్ పేరిట లేఔట్ వేసి మొత్తం 286 ప్లాట్లను అమ్మేశాడు. ఖాజా పాషా 2002లో చనిపోయాడు. ఇదే ఖాజాపాషా ఆ 16 ఎకరాల భూమిని తమకు 2005లో అమ్మేశాడని బుచ్చిదాసు, వినోబాగౌడ్ తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపి ఆ భూమిని మోహన్ రెడ్డి, శ్రీనివాస్‌రావుకు అమ్మేశారు. వీరిద్దరూ రిలయన్స్ మెట్రోపాలిటన్ ఎండీ శ్రీనివాసరావుకు అమ్మేయగా.. ఆయన 2010లో ఆ భూమిలో నుంచి పెద్దమొత్తం భూమిని గాజుల గోవిందరావుతోపాటు మరికొందరికి అమ్మేశారు. వారంతా ఆ భూమిని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో తాకట్టు పెట్టి కోట్ల రుణం తీసుకున్నారు. లోన్ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఈ భూమిని వేలం వేసేందుకు రాగా ప్లాట్ల ఓనర్లకు అసలు విషయం తెలిసింది. ఇదంతా జరుగుతుండగానే భూమి మళ్లీ చేతులు మారింది. ధరణిలో ప్రస్తుతం ఎ.మహేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, గాజుల గోవిందరావు, భాగ్యరేఖ అనే పేర్లు కనిపిస్తున్నాయి. గతంలో ఈ భూముల లావాదేవీలపై తహసీల్దార్ నివేదిక సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్లాట్ల ఓనర్లు తమ ప్లాట్లపైకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లోనే ఎక్కువ
డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాల్లోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నాలా కన్వర్షన్ చేయకుండా ప్లాట్లు చేసి అమ్మిన భూములకు వ్యవసాయ భూములుగానే పాత ఓనర్లకు పట్టాలు రావడంతో వారు ఇతరుల పేరిట జీపీఏ, లేదా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాటినే మరోసారి ఫామ్ ల్యాండ్స్ గా అమ్మి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ధరణిలో చెక్ చేస్తే డేటా కనిపించడం, తహసీల్దార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో కొనుగోలుదారులకు కూడా ఎలాంటి అనుమానం రావడం లేదు. రిజిస్ట్రేషన్ల సమయంలో కార్డు (రిజిస్ట్రేషన్ల శాఖ) డేటాను కూడా చెక్ చేయాల్సి ఉన్నా తహసీల్దార్లు ఇవేమి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు డేటాలో ఒకలా.. ధరణిలో మరొకలా..
ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడానికి ముందు వ్యవసాయ భూములు అనేకం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేల్ డీడ్ ద్వారా రిజిస్టర్ అయ్యాయి. ఇలాంటి భూములు చాలా వరకు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. కొనుగోలుదారుల వద్ద రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నా.. రెవెన్యూ రికార్డుల్లోకి వచ్చేసరికి పాత యజమానుల పేర్లు, లేదంటే వేరొకరి పేర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి, నిర్లక్ష్యం కారణంగా చాలా మ్యుటేషన్లు పెండింగ్ లో ఉండిపోయాయి. కొందరు తెలియక ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఇలాంటి ప్రాపర్టీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ.. ధరణిలో మాత్రం మ్యుటేషన్ కావడం లేదు. ఇలా మ్యుటేషన్ పెండింగ్ లో ఉండి ధరణిలో మళ్లీ తమ పేర్లే వచ్చినట్లు గుర్తించిన కొందరు పాత ఓనర్లు అత్యాశతో వేరొకరికి అమ్మేస్తున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లు కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి.
భూమి పోయిందని.. ప్రాణాలు విడిచిన్రు!
తనకున్న పొలం మొత్తం ధరణిలో నమోదు కాకపోవడం, ఏడాదిన్నరగా ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకలకు చెందిన రైతు బోయ రాముడు ఈ ఏడాది జనవరి 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన చింతల స్వామి(45) అప్పులు పెరగడంతో తన తండ్రి నర్సయ్య పేరిట ఉన్న 14.5 గుంటల భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే ధరణిలో తప్పుగా ఎంట్రీ చేయడంతో నర్సయ్యకు చెందిన 14 .5 గుంటల భూమి వేరే వ్యక్తుల పేరు మీదికి మారింది. అప్పటి నుంచి స్వామి తండ్రి నర్సయ్యతో కలిసి రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు. అదే ఏడాది తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత కూడా స్వామి ఆఫీసర్ల చుట్టూ తిరగడం ఆపలేదు. తన భూమి ఎవరి పేరిట అయితే పడిందో వారు భూమిని కుదువ పెట్టి బ్యాంకుల్లో అప్పు తీసుకున్నారని, మార్టిగేజ్ లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని ఆఫీసర్లు చెప్పటంతో స్వామి 2021 డిసెంబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన గోపు రోజమ్మ(65)కు ఉన్న రెండు ఎకరాల భూమి వేరే ఇద్దరు వ్యక్తుల పేరిట నమోదైంది. ఆ భూమిని తన పేరున నమోదు చేయాలని రోజమ్మరెవెన్యూ అధికారులను కోరింది. అయినా ధరణిలోనూ వారి పేర్లే రావడంతో 2020 నవంబర్ 14న పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడింది.
కందుకూరు మండలం అన్నోజిగూడకు చెందిన రైతు రాములుకు చెందిన ఎకరంన్నర భూమి ఫార్మాసిటీలో పోయింది. పీఓటీ కేసు పేరిట పరిహారమివ్వలేదు. అలాగే ఆయన తిమ్మాయిపల్లి రెవెన్యూ కొనుగోలు చేసిన ఎకరం భూమి ధరణిలో నమోదు కాలేదు. బిడ్డ పెండ్లికి చేసిన అప్పులు భూమి అమ్మి కట్టేద్దామంటే ధరణిలో రాకపోవడం వల్ల అమ్మలేకపోయాడు. ఇటు పరిహారం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రాములు 2021 నవంబర్ 3న ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామానికి చెందిన చిన్న రామయ్యకు సర్వే నంబర్ 82లో 19 గుంటల ఇనాం భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ గ్రామంలోని 78, 82, 18, 22 సర్వే నంబర్లలోని 66 ఎకరాల భూమి ధరణిలో రాణి శంకరమ్మ పేరిట రావడంతో ఆమె వారసులు రియల్టర్లకు అమ్మేశారు. ఈ క్రమంలోనే వారు రామయ్యతోపాటు 120 మంది సాగు చేసుకుంటున్న భూముల్లోకి సర్వే పేరిట వచ్చారు. దీంతో తనకు భూమి దక్కదన్న బెంగతో 2021 నంబర్ 6న రామయ్య గుండెపోటుకు గురై చనిపోయాడు.
సమస్యలపై లక్షల్లో దరఖాస్తులు..
నిషేధిత ఆస్తుల జాబితా నుంచి సర్వే నంబర్ల తొలగింపు, మిస్సింగ్ సర్వే నంబర్ల యాడింగ్, పట్టాదారు పాస్ బుక్ జారీ కాకపోవడం, పాస్ పుస్తకాల్లో తప్పులు, పెండింగ్ మ్యుటేషన్ కు సంబంధించి వివిధ రకాల సమస్యలపై సుమారు 5 లక్షల దరఖాస్తులు ధరణి పోర్టల్ ద్వారా వచ్చాయి. ఇందులో ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యుల్ ద్వారా వచ్చినవి 2.42 లక్షలు, ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తీసేయాలని వచ్చినవి మరో లక్షన్నర అప్లికేషన్ల వరకు ఉన్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కోసం కేబినేట్ సబ్ కమిటీ వేసి ఇటీవల కొద్ది రోజులు హడావుడి చేసిన సర్కార్ పెద్దలు మళ్లీ ఆ సమస్యల పరిష్కరించేందుకు ముందుకు వస్తలేరు.