ఇపుడైనా భూ సమస్యలు తీరేనా.. పెండింగ్‌‌‌‌లోనే పార్ట్‌‌‌‌–బి భూములు  

ఇపుడైనా భూ సమస్యలు తీరేనా.. పెండింగ్‌‌‌‌లోనే పార్ట్‌‌‌‌–బి భూములు  
  • కొత్త పాస్ పుస్తకాలు రాక నష్టపోతున్న రైతులు 
  • ఏండ్లు గడుస్తున్నా పరిష్కారం కావడంలేదని ఆవేదన

మెదక్, శివ్వంపేట, వెలుగు:  మెదక్‌‌‌‌ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన  రైతులు ధరణి రికార్డుల్లో లోపాలు,  ఫారెస్ట్ – రెవెన్యూ వివాదాలు, కొత్త పాస్ బుక్ లు రాకపోవడం లాంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా  రైతుబంధు, రైతు బీమా పథకాలు పొందలేకపోతున్నారు.  కొన్ని చోట్ల  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, లీడర్లు పేదల భూములు కబ్జా చేసి వెంచర్లు వేశారు.  ప్రధానంగా శివ్వంపేట మండలంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండగా, కౌడిపల్లి, చిలప్‌‌‌‌చడ్, చేగుంట, రామాయంపేట, నిజాంపేట్, చిన్నశంకరంపేట మండలాల్లో చాలా మంది రైతులు భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 

  • శివ్వంపేట మండలం కొంతాన పల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  40 మంది దళిత రైతులకు సర్వే నంబర్ 328, 329 లో 26 ఎకరాల భూమి పంపిణీ చేశారు.  కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వారి భూమి కబ్జా చేసి మీ భూమి ఇక్కడ లేదు వేరే దగ్గర ఉందని వెళ్లగొట్టాడు. సదరు రైతులు ఆ భూమి సాగుకు ప్రయత్నించగా 12 మంది రైతుల మీద కేసులు నమోదు చేయించాడు.  రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఓ ప్రైవేట్ వెంచర్ లో దళిత రైతుల భూమి ఉన్నట్టుగా నిర్ధారించారు. వారికి పాస్ బుక్ లు కూడా ఇచ్చినప్పటికి రెండేళ్లవుతున్నా సంబంధిత రైతులకు భూమి పొజిషన్ మాత్రం చూపడం లేదు. 
  •  కొంతాన పల్లి తండాకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలకు చెందిన 20 ఎకరాలు పార్ట్ – బి లో పెట్టడంతో వారికి కొత్త పాస్ బుక్‌‌‌‌లు రాలేదు.  దీంతో వారు రెవెన్యూ ఆఫీస్‌‌‌‌ల చుట్టూ తిరుగుతున్నారు.
  • నవాబ్‌‌‌‌పేట్ గ్రామంలో సర్వే నంబర్ 236, 262, 309లో ఉన్న దాదాపు 400 మంది రైతులకు సంబంధించిన 900 ఎకరాలు రికార్డ్ లో ఉన్న దానికంటే ఎక్సెస్ ఉందని పార్ట్ – బి లో పెట్టారు. దాంతో సదరు రైతులకు రైతు బంధు, రైతు బీమా, క్రాప్ లోన్లు ఏవీ అందడం లేదు.చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో సర్వే నెంబర్ 634 లో రెవెన్యూ ఆఫీసర్లు 107 మంది రైతులకు 134 ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించి 1989లో పట్టా సర్టిఫికెట్ లు ఇచ్చారు. అలాగే సర్వే నెంబర్485లో 100 ఎకరాలను వంద మంది రైతులకు పంపిణీ చేశారు.  2005లో వారికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ మేరకు గతంలో వారికి పాస్ బుక్ లు కూడా వచ్చాయి. సంబంధిత రైతులు భూములు చదును చేసుకుని, బోర్లు తవ్వుకుని పంటలు సాగు చేసుకున్నారు. కాగా 2017లో భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో సదరు భూములు అటవీ శాఖ పరిధిలోనివని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు పేర్కొనడంతో పార్ట్ – బిలో పెట్టారు. దీంతో సంబంధిత రైతులకు కొత్త పట్టాదార్ పాస్ బుక్ లు అందలేదు. ఫలితంగా వారు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రయోజనాలు అందడంలేదు.  

 ఇనాం భూమి వివాదం  

శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలో ఇనాం భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన రైతు సయ్యద్ అబ్దుల్ అతీఫ్, ఇంతియాజ్, బురాన్ రెండు రోజుల కింద హైద్రాబాద్‌‌‌‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి ఫిర్యాదు చేశారు.  సర్వే నంబర్ 47 నుంచి 66 , 70, 74, 77, 80, 81, 83, 84, 86, 87 లో  భూములను దాదాపు వంద సంవత్సరాల నుంచి వంశపారపర్యంగా సాగు చేసుకుంటున్నామని వారు చెబుతున్నారు.  ఈ భూమిపై హై కోర్టులో స్టే ఉన్నప్పటికి లెక్కచేయకుండా, గ్రామసభ పెట్టకుండా, ఎవరికి  నోటీసులు ఇవ్వకుండా, ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా ఒకే ఇనాందారు పేరు మీద వందలాది ఎకరాల భూమికి ఓఆర్సీ జారీ చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వారు మంత్రికి ఫిర్యాదు చేశారు. 

జాయింట్​ సర్వేతో పరిష్కారం

శివ్వంపేట మండలం నవాపేట, చేగుంట మండలం ఇబ్రహీంపూర్​, రుక్మాపూర్​, చిన్నశంకరంపేట, కౌడిపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో పార్ట్​ – బి లో పెట్టిన భూముల సమస్య పరిష్కారానికి ఫారెస్ట్​, రెవెన్యూ డిపార్ట్​మెంట్​ల ఆధ్వర్యంలో జాయింట్​ సర్వే చేయాలి. రెండు శాఖల ఉన్నతాధికారులు స్పందించి జాయింట్​ సర్వే చేస్తేనే పార్ట్​ –  బిలో పెట్టిన భూముల సమస్య పరిష్కారమైన సంబంధిత రైతులకు కొత్త పట్టాదార్​ పాస్ బుక్​ లు ఇవ్వడానికి వీలవుతుంది. ఆ దిశగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. 

తహసీల్దార్ వివరణ..

శివ్వంపేట మండలంలో నెలకొన్న భూముల సమస్య విషయమై తహసీల్దార్ శ్రీనివాస్ చారి వివరణ కోరగా...  కొంతాన్ పల్లి దళితుల భూములు సర్వే చేశామని, హద్దులు చూపించాల్సి ఉందన్నారు.  త్వరలోనే సంబంధిత రైతులకు హద్దులు చూపిస్తామని చెప్పారు. నవాపేట భూముల విషయమై కలెక్టర్​కు నివేదిక పంపామని త్వరలోనే ఆ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు.  సికింద్లాపూర్​ రైతులు ఇనాందారులతో మాట్లాడుకొని భూములు రిజిస్ట్రేషన్ లు చేసుకుంటున్నారని తెలిపారు. ఇనాందారులకు  ఆర్డీవో ఓఆర్సీలు ఇష్యూ చేశారని చెప్పారు. కొంతాన్​పల్లికి చెందిన శివయ్య అనే రైతుకు సంబంధించిన భూమి రిజర్వు ఫారెస్ట్ ఏరియాలో ఉందని, అది తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

నాలుగెకరాలు కబ్జా అయ్యింది

మాకు కొంతాన్ పల్లిలో సర్వే నంబర్ 180లో  7 ఎకరాల 20 గుంటలు భూమి ఉంది. మా భూమి పక్కన వెంచర్ చేసిన ఓ బీఆర్ఎస్ లీడర్  మా భూమి4 ఎకరాల వరకు  కబ్జా చేసి కడీలు వేసిండు. ఆ భూమిని తనకు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నడు. లేకపోతే నీ భూమి నీకు ఉండదంటూ బెదిరిస్తున్నాడు.  భూమి కబ్జా విషయమై నేను కలెక్టర్, ఎస్పీకి  ఫిర్యాదు చేశాను. కానీ ఇంత వరకు నాకు న్యాయం జరగలేదు.

 జయలక్ష్మీ, రైతు, కొంతాన్పల్లి

నాలుగేళ్లుగా తిరుగుతున్నా... 

శివ్వంపేట మండలం కొంతాన్ పల్లికి చెందిన రైతు గొల్ల శివయ్య వంశపారపర్యంగా సర్వే నంబర్ 349లో 1 ఎకరా 37 గుంటల భూమి సాగు చేసుకుంటున్నాడు. కొన్నేళ్ల కింద బతుకు దెరువు కోసం హైదరాబాద్‌‌‌‌కు వలస వెళ్లగా అదే అదునుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి తన భూమి కబ్జా చేశాడని శివయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  సర్వే కోసం దరఖాస్తు చేస్తే రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి నీ భూమి ఫారెస్టులో ఉందని చెప్పారని, ఫారెస్ట్ ఆఫీసర్లు సర్వేచేసి రెవెన్యూలో ఉందని చెప్పారని తెలిపాడు. నాలుగేళ్లుగా ఆఫీసర్ల చుట్టు తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపాడు.