![ఏఈవోలపై రైతు వేదికల భారం](https://static.v6velugu.com/uploads/2025/02/farmers-forums-funds-not-sanctioned-for-29-months-in-warangal_omn8bSLZcW.jpg)
- 29 నెలలుగా మంజూరు కాని నిర్వహణ నిధులు
- ఉమ్మడి వరంగల్లో 334 రైతు వేదికలు
- నిర్వహణ బకాయిలు రూ.8.71 కోట్లు
మహబూబాబాద్, వెలుగు: రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించగా వాటి నిర్వహణ బాధ్యత ఏఈవోలకు భారంగా మారింది. తొలుత ఈ రైతు వేదికల నిర్వహణకు ప్రతి నెల రూ.3 వేలు కేటాయించగా, ఆ నిధులు సరిపోకపోవడంతో అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రతిపాదనలతో నెలకు రూ.9 వేల చొప్పున అందిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
2022 ఆగస్టులో 5 నెలలకు కలిపి ఒక్కో రైతు వేదికకు రూ.45 వేలు చొప్పున ఫండ్ మంజూరు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు 29 నెలలుగా రైతు వేదికల మెయింటనెన్స్ ఫండ్ రిలీజ్చేయకపోవడంతో నిర్వహణ కష్టతరమవుతోంది. నిర్వహణ బాధ్యతలు ఏఈవోలకు ఇవ్వడంతో వారికి ఇదో పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 334 రైతు వేదికలు ఉండగా, సుమారు రూ.8.71 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాల వారీగా రైతు వేదికలు..
రైతులకు ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో మహబూబాబాద్82, హనుమకొండ 55, ములుగు 31, జయశంకర్ భూపాలపల్లి 45, జనగామ 62, వరంగల్ 59 మొత్తం ఉమ్మడి జిల్లాలో 334 ఉండగా, ఆయా రైతు వేదికలను ఒక్కొక్కటిగా పూర్తి చేసి 2020 ఏప్రిల్ వరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ, ఈ వేదికల నిర్వహణకు నిధులు సరిపోకపోవడంతో ఏఈవోలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.
ఏఈవోల అవస్థలు..
రైతు వేదికల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఏఈవోలకు అప్పగించడంతో ప్రతి నెలా విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులు, స్టేషనరీ, రైతు శిక్షణలు, తాగునీటి సదుపాయం ఇలా ప్రతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. రూ.12 వేల నుంచి రూ.15 వేల చొప్పున విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోతుండగా, తాత్కాలికంగా స్వీపర్లను నియమించుకున్నా డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడంతో వారు రావడం లేదు. దీంతో వేదికలు శుభ్రం చేసుకునే బాధ్యతలు కూడా ఏఈవోలే చేపట్టక తప్పడం లేదు.
గ్రామాల్లో మట్టినమూనా పరీక్షలు చేసి, భూసార ఫలితాలను రైతులకు అందించడం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు సమావేశమై సాగుసమస్యలు, ఆధునిక పద్ధతులపై చర్చించేందుకు వీలుగా ప్రతి అసెంబ్లీ నియోజకర్గంలో ఒక రైతు వేదికను ఎంపిక చేసి, వీడియో కాన్ఫరెన్స్ సెట్, పెద్ద మానిటర్, రెండు స్పీకర్లు, పవర్ బ్యాటరీ, మినీ ల్యాబ్ కిట్లు అందించారు. కొన్ని రోజుల వరకు ఫండ్, రసాయనాలు ఇచ్చినా ప్రస్తుతం నిర్వహణ సరిగ్గా లేకుండా పోతుంది.
బిల్లుల కోసం ప్రతిపాదనలు పంపించాం..
రైతు వేదికల నిర్వహణ నిధుల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రభుత్వం ఫండ్మంజూరు చేయగానే రైతు వేదికల వారీగా నిధులు అందజేస్తాం. ఆలస్యం కావడంతో ఏఈవోలకు ఇబ్బందులు తప్పడం లేదు. త్వరలోనే ఫండ్మంజూరయ్యే అవకాశం ఉన్నది.
విజయ నిర్మల , జిల్లా వ్యవసాయ అధికారి, మహబూబాబాద్