![తెలంగాణ రాష్ట్రం వడ్లు కర్నాటకకు సరఫరా](https://static.v6velugu.com/uploads/2022/11/paddy-to-Karnataka_jiop6ga9Du.jpg)
అక్కడ క్వింటాల్ ధర రూ.2,450.. రాష్ట్రంలో రూ.2,060 మాత్రమే
నారాయణపేట/ మాగనూర్, వెలుగు : మన రాష్ట్రం నుంచి రైతులు ప్రతిరోజు వేల క్వింటాళ్ల వడ్లు కర్నాటకలోని రాయిచూర్, యాద్గిర్, గుర్మిట్కు తరలించి అమ్ముకుంటున్నారు. ఇక్కడ సర్కారు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులలో క్వింటాల్ వడ్ల ధర రూ.2,060 మాత్రమే ఉంది. పైగా తేమ, తరుగు పేరుతో అందులో కొంత కోత పెడుతున్నారు. కర్నాటకలో క్వింటాల్‌కు రూ.2,450 చెల్లిస్తుండటంతో రైతులు పొరుగు రాష్ట్రంలో అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. ధాన్యం ఎక్కువ ఉంటే రవాణా, హమాలీ ఖర్చులు కూడా వ్యాపారులే భరిస్తున్నారు. క్వింటాల్‌కు రెండే కిలోల తరుగు తీస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకపోవడం, ధాన్యం అమ్మిన రోజే డబ్బులు ఇస్తుండటంతో నారాయణపేట జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు వడ్లు అమ్మేందుకు కర్నాటకకు క్యూ కడుతున్నారు.
96 సెంటర్ల ఏర్పాటుకు ప్రపోజల్స్
నారాయణపేట జిల్లాలో 96 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి దాక 70 మాత్రమే తెరిచారు. కోతలు ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రభుత్వం వారం రోజుల కిందే ఈ కేంద్రాలను ప్రారంభించింది. కొన్ని కేంద్రాలలో గన్నీ బ్యాగుల కొరత కూడా ఉంది. తేమ శాతం రూల్‌తో రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలోని కొనుగోలు సెంటర్లలో 196 మంది రైతుల నుంచి 1,470 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొన్నారు.
మూడేండ్లుగా హమాలీ చార్జీలు రావట్లేదు
రాష్ట్రంలో సర్కార్ కొనుగోలు సెంటర్ల ద్వారా కొంటున్న ధాన్యం రవాణా, హమాలీ, వేబ్రిడ్జ్ చార్జీలు మొత్తం రైతులే భరిస్తున్నారు. నిజానికి హమాలీ, వేబ్రిడ్జ్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా గత మూడేండ్ల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
కర్నాటకలో ధర ఎక్కువుంది
కర్ణాటకలోని రాయచూర్ మార్కెట్లో ధాన్యం ధర ఎక్కువుంది. మన దగ్గర క్వింటాల్‌కు రూ.2060 ఇస్తే అక్కడ రూ.2450 పలుకుతోంది. అందుకే రాయచూర్ కు వెళ్లి వడ్లు అమ్ముకుంటున్నాం. ఎక్కువ ధాన్యం ఉంటే ట్రాన్స్‌పోర్టు చార్జీలు కూడా అక్కడి వ్యాపారులే భరిస్తున్నారు.
- కృష్ణయ్య, గుడేబల్లూర్, కృష్ణా మండలం
కష్టాలు తప్పినయ్
వడ్లు అమ్మేందుకు గత సీజన్లో ఇక్కడ చాలా కష్టాలు పడ్డాం. ఈసారి కర్నాటకలో ధాన్యానికి మంచి ధర వచ్చింది. అక్కడి వ్యాపారులే వచ్చి మాకు కష్టం లేకుండా ధాన్యం తీసుకెళ్లి మంచి ధర కట్టిస్తున్నారు. నాకు పెద్ద భారం తప్పింది.
- మారెప్ప, అచ్చంపేట గ్రామం, మాగనూర్ మండలం
ఎక్కడైనా అమ్ముకోవచ్చు
రైతులు పండించుకున్న ధాన్యం ఎక్కడ మంచి రేటు వస్తే అక్కడ అమ్ముకోవచ్చు. మన దగ్గర కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమైన మాట నిజమే. అయినా అనుకున్న టార్గెట్ ప్రకారం కొనుగోలు చేస్తం. హమాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నం. హమాలీ చార్జీలు సర్కార్ నుంచి రాగానే రైతులు ఖాతాల్లో నేరుగా వేస్తం.
-అథిరాం నాయక్, డీఎం, సివిల్ సప్లై స్డిపార్ట్మెంట్