ఖరీఫ్ ప్లాన్​ రెడీ.. పంట ప్రణాళికను సిద్ధం చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లు

ఖరీఫ్ ప్లాన్​ రెడీ.. పంట ప్రణాళికను సిద్ధం చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లు
  • గతంలో కంటే ఎక్కువ సాగు అయ్యే ఛాన్స్
  • జూరాలకు కూడా ముందుగానే నీళ్లు వచ్చే అవకాశం.

గద్వాల, వెలుగు: జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు ముందస్తుగా కురవడంతో  రైతులు  దుక్కులు దున్నడం ప్రారంభించారు.  ఇప్పటికే నడిగడ్డలో సీడ్  రైతులు   పంటలను సాగు చేశారు. వేరుశనగ, వరి, కంది,  పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. 

జూరాల కింద సాగుపై చిగురిస్తున్న ఆశలు

అగ్రికల్చర్ ఆఫీసర్లు పంటప్రణాళికను రెడీ చేశారు. 2023 ఖరీఫ్ తో పోలిస్తే ఈ సారి  జిల్లాలో  సాగు పెరిగే ఛాన్స్ ఉన్నది.     రబీ సీజన్ లో జిల్లాలో పెద్దగా సాగు జరగలేదు.   ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో క్రాప్ హాలిడే  ప్రకటించిన సంగతి తెలిసిందే.    ఈసారి  ప్రాజెక్టులలోకి  కూడా ముందుగానే నీరు రావచ్చని అంచనాలతో జూరాల ఆయకట్టులో కూడా సాగు విస్తీర్ణం పెరుగనుందని అంచనా..    ఇప్పటికే జూరాలకు తాగునీటి  కోసం  ఒక టీఎంసీ   చేరింది. ప్రస్తుతం జిల్లాల కురుస్తున్న వర్షాలకు కృష్ణానది క్యాచ్​మెంట్​ ఏరియా నుంచి కూడా నీరు  జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నది. దీంతో  ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల ఈసారి త్వరగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

1,70,379 హెక్టార్లలో పంట సాగు

2024 ఖరీఫ్ సీజన్లో  జిల్లాలో  1,70,379 హెక్టార్లలో  పంటల సాగు జరుగుతుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గ ప్లాన్​ రెడీ చేశారు. ఇందులో వరి 37,755 హెక్టార్లు, మొక్క జొన్న 6107 హెక్టార్లు, కంది 10, 500 హెక్టార్లు, కమర్షియల్ పత్తి 68,046 హెక్టార్లు, మిరప 30,337 హెక్టార్లు, హార్టికల్చర్ క్రాప్ కింద 11316 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది.  

 సాగు పెరిగే ఛాన్స్

జోగులాంబ గద్వాల జిల్లాలో 2024 ఖరీఫ్ సీజన్ లో సాగు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రబీ సీజన్లో పంటలు వేయకపోవడంతో  ఈ సారి రైతులు  సాగుకు సిద్ధమవుతున్నారు.  2023 ఖరీఫ్ లో 1,48,156 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కాగా 2024 ఖరీఫ్ లో మాత్రం1,70,379  హెక్టార్లలో ఇతరులలో పంటలు సాగు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

1,13,912 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి

ఈసారి రైతులకు దాదాపు 1,13,912 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. యూరియా 3513, డీఏపీ 12,919, ఎస్ ఎస్ పి 4073, ఏఎస్ 2670, ఎం ఓ పి 5954, కాంప్లెక్స్ ఎరువులు53,173 మెట్రిక్ టన్నులు  అవసరమవుతాయని ఆఫీసర్లు గుర్తించారు. ఈ మేరకు అన్ని ఎరువులను జిల్లాలో రెడీగా ఉంచినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు.

రైతులకు ఇబ్బందులు కలగనీయం


ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనియం. రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు రెడీగా ఉన్నాయి. ఈసారి రైతులు ముందస్తుగా పంటలు సాగు చేసే పరిస్థితి కనిపిస్తున్నది. విత్తనాలు కొనేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పంట సాగు విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ల సూచనలు పాటించాలి.
- గోవింద్ నాయక్ జిల్లా
 అగ్రికల్చర్ ఆఫీసర్ గద్వాల.