ప్రధాని మోదీకి రైతులు రుణపడి ఉంటారు :ఏలేటి మహేశ్వర్ రెడ్డి

 

  • పసుపు బోర్డుపై మాట నిలబెట్టుకున్న బీజేపీ సర్కార్
  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్/భైంసా, వెలుగు: పసుపు బోర్డుపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రైతులంతా రుణపడి ఉంటారని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి అన్నారు. నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం నిర్మల్​లో ప్రధాని మోదీ ఫొటోకు బీజేపీ నాయకులు పసుపు కొమ్ములు సమర్పించి క్షీరాభిషేకం చేశారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు.

ఇప్పటివరకు పసుపు మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి రైతులంతా తమ పంటను మహారాష్ట్రకు తరలించి అక్కడ తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని, ఇలా  చాలామంది రైతులను దళారులు మోసం చేశారన్నారు. ఇకనుంచి ఇలాంటి సమస్యలు ఉండబోవన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జి రావుల రామనాథ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, ముత్యంరెడ్డి, ఆశన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ తదితరులు 
పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని

ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేశారని.. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. గురువారం భైంసా మండలం పెండ్​పల్లిలో పసుపు పొలంలో ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. పసుపు రైతు రామును సన్మానించారు.

పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతాంగానికి మద్దతు ధరతో పాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, నాయకులు పండిత్ రావ్ పటేల్, మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్, రాజేశ్వర్, సాయన్న, చందర్ పటేల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.